NTV Telugu Site icon

Rishabh Pant: నాపై ఫేక్‌ న్యూస్ రాసేకంటే.. మంచి సమాచారం ఇవ్వండి!

Rishabh Pant Lsg

Rishabh Pant Lsg

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌ రేసు నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) నిష్క్రమించిన విషయం తెలిసిందే. 13 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఆరంభంలో మంచి విజయాలు సాధించిన లక్నో.. సీజన్ మధ్యలో వరుస ఓటములతో మూల్యం చెల్లించుకుంది. లీగ్ దశలో మిగిలిన మ్యాచ్ గెలిస్తే.. పట్టికలో కాస్త పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎల్‌ఎస్‌జీ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి తప్పుకోవడానికి కారణం రిషభ్ పంత్ అనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

ఐపీఎల్‌ 2025లో రిషభ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఇటు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా పూర్తిగా నిరాశపరిచాడు. వేలంలో రూ.27 కోట్ల భారీ ధర పలికిన పంత్.. 13 మ్యాచ్‌ల్లో 151 పరుగులు మాత్రమే చేశాడు. ఈ గణాంకాలు చూస్తేనే అర్ధం చేసుకోవచ్చు.. అతడు ఎలా ఆడాడో. పంత్ విఫలమైన వేళ నెట్టింట ఓ ట్వీట్ చక్కర్లు కొడుతోంది. పంత్‌కు రూ.27 కోట్లు చాలా ఎక్కువని, వచ్చే సీజన్‌కు ముందు ఎల్‌ఎస్‌జీ అతడిని రిలీజ్‌ చేసే అవకాశముందని ఎక్స్‌లో ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుపై పంత్ స్పందిస్తూ నాపై ఫేక్‌ న్యూస్ రాసేకంటే మంచి సమాచారం ఇస్తే బాగుంటుందన్నాడు.

‘ఫేక్‌ న్యూస్ ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఓ అజెండాతో ఫేక్‌ న్యూస్ రాసేకంటే.. విశ్వసనీయంగా సమాచారం ఇస్తే చాలా బాగుంటుంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తల విషయంలో అందరూ మరింత బాధ్యతగా, అప్రమత్తంగా ఉండాలి’ అని రిషభ్ పంత్ నెటిజన్ పోస్టుకు రిప్లై ఇచ్చాడు. ఐపీఎల్ 2024లో కేఎల్ రాహుల్ విఫలమవడంతో ఎల్‌ఎస్‌జీ అతడిని వదిలిపెట్టిన విషయం తెలిసిందే. మరి భారీ ధర పెట్టి కొన్న పంత్ ఐపీఎల్ 2025లో అన్ని విధాలుగా విఫలమయ్యాడు. మరి ఎల్‌ఎస్‌జీ పంత్‌ను అట్టిపెట్టుకుంటుందా? లేదో చూడాలి.