పాకిస్తాన్‌పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి తన పేలవ ఫామ్‌కు గుడ్‌బై చెప్పిన భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మెరుపు ఇన్నింగ్స్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లకు ముందు తనలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపిందని ఆమె తెలిపింది. బర్మింగ్‌హామ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రిచా ఘోష్ కేవలం 17 బంతుల్లోనే 34 పరుగులు చేసి భారత్ 170 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 64 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది.
నెదర్లాండ్స్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్‌కు ముందు రిచా ఘోష్ మాట్లాడుతూ.. “పాకిస్తాన్‌పై ఆడిన ఆ ఇన్నింగ్స్ నాకు ఎంతో సహాయపడింది, దీనివల్ల నా కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది” అని చెప్పింది. ప్రపంచకప్ కంటే ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (68 పరుగులు) చేయడం కూడా తన నైతిక బలాన్ని పెంచిందని, మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహా అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నట్లు ఆమె పేర్కొంది.
ప్రపంచకప్‌కు ముందు రిచా ఘోష్ తీవ్ర ఫామ్ లేమితో బాధపడింది. అంతకుముందు ఆడిన మ్యాచ్‌ల్లో ఆమె కేవలం 0, 6, 8, 4 పరుగులు మాత్రమే చేసి కనీసం రెండంకెల స్కోరు కూడా దాటలేకపోయింది. నెట్స్‌లో కష్టపడినప్పటికీ పరుగులు రాకపోవడంపై స్పందిస్తూ.. “నేను నా ఆటపైనే దృష్టి పెట్టాను. నెట్స్‌లో గట్టిగా శ్రమించాను. నేను టచ్‌లోనే ఉన్నా పరుగులు రాలేదు. ఆ సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన వంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు కోచ్‌తో మాట్లాడాను. నా సహజసిద్ధమైన ఆటను ఆడమని, అనవసర ఒత్తిడి తీసుకోకుండా ఫోకస్ చేయమని వారు చెప్పారు. ఆ సలహాలు నాకు బాగా పనిచేశారు” అని రిచా వివరించింది.
ఈ మ్యాచ్‌లో ఆరో వికెట్‌కు దీప్తి శర్మతో కలిసి రిచా ఘోష్ 45 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీప్తితో ఉన్న బాండింగ్ గురించి చెబుతూ, డొమెస్టిక్ క్రికెట్‌లో తామిద్దరం బెంగాల్ జట్టు తరఫున ఆడామని, మైదానం లోపల మరియు వెలుపల తమ మధ్య ఉండే మంచి అనుబంధం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని తెలిపింది. భారత బ్యాటింగ్ లైన్-అప్‌లో వెన్నుముక లాంటి రిచా ఘోష్ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమిండియా ప్రపంచకప్ గెలవడానికి ఎంతో కీలకం కానుంది.

