Miss Universe India 2024: గుజరాత్‌ యువతిదే ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటం.. ఇక మిస్ యూనివర్స్ టైటిల్ టార్గెట్!

  • మిస్ యూనివర్స్ ఇండియాగా రియా
  • టైటిల్ కోసం 51 మంది పోటీ
  • మిస్‌ యూనివర్స్‌ పోటీకి రియా
Rhea Singha Miss Universe

Rhea Singha Miss Universe

Rhea Singha Wins Miss Universe India 2024 Title: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2024 టైటిల్‌ను గుజరాత్‌ యువతి రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలేలో 51 మంది టైటిల్ కోసం పోటీ పడగా.. 19 ఏళ్ల రియా విజేతగా నిలిచారు. మాజీ మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతేలా కిరీటాన్ని బహుకరించారు. రియా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.

మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్న అనంతరం రియా సింఘా ఆనందం వ్యక్తం చేశారు. ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి నేను చాలా కష్టపడ్డా. నేను ఈ కిరీటానికి అర్హురాలిని అని భావిస్తున్నా. గత విజేతలే నాకు స్ఫూర్తి’ అని రియా చెప్పారు. రియా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నివాసి. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా దంపతుల కుమార్తె ఆమె. రియా టాప్ మోడల్. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 40 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. రియా ఇన్‌స్టాలో బోల్డ్‌ ఫొటోస్ షేర్ చేస్తుంటారు.

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా పదేళ్ల క్రితం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024కు ఊర్వశి న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. రియా సింఘా విజేతగా గెలిచిన అనంతరం ఊర్వశి తన చేతులతో కిరీటాన్ని బహుకరించారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ కిరీటం మళ్లీ భారత్‌కు వస్తుందని ఊర్వశి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో ప్రాంజల్ ప్రియ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. ఛవీ వర్గ్, సుస్మితా రాయ్, రూప్‌ఫుజానో విసో తరువాతి స్థానాల్లో నిలిచారు.