CM Revanth Reddy: సమాఖ్యల అవసరం ప్రస్తుతం ఎంతైనా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన SAMAKHYA బిజినెస్ సమ్మిట్-2026ను ప్రారంభించిన ఆయన సమావేశంలో ప్రసంగించారు. సమైఖ్య అనే పదం చాలా బలమైనదని, ఈ అధునాతన యుగంలో అది అత్యంత అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, కొత్త తరానికి నూతన వాణిజ్య చట్టాలపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగడంతో పాటు సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అంతరిక్షంలోకి రాకెట్‌ను పంపించటంలో మన దేశ యువత ఎలోన్ మస్క్ తో పోటీ పడుతోందని, గ్లోబల్‌గా వస్తున్న మార్పులకు అనుగుణంగా అందరూ పని చేయాలని సూచించారు. కొత్త తరానికి తమ ఆలోచనలు అందించే ప్రయత్నం అభినందనీయమని అన్నారు. ఈ తరం జనరేషన్‌కి లెగసీ, సక్సెస్ స్టోరీలను తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వందేళ్ళ స్వతంత్ర ప్రయాణంలో ఇప్పుడు మనం ఎక్కడికి చేరుకున్నాం అనేది సమీక్ష చేసుకోవాలని, 2047 అనేది చాలా కీలకమైన సమయమని వ్యాఖ్యానించారు. నీతి ఆయోగ్ లో కూడా ప్రధాని మోడీకి ఈ అంశంపై సూచన చేశామని, వారు కూడా రాష్ట్రాల సహకారం కోరుతున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, ఆ తర్వాత కేవలం అభివృద్ధి మీదనే తమ ఫోకస్ ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ తెచ్చి పారిశ్రామిక రంగాన్ని పెంచే పనిలో ఉన్నామని, ORR రావడం వల్ల చాలా ఏరియాలకు మంచి యాక్సెస్ వచ్చిందని చెప్పారు. యువ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నామని, ఇండివిడ్యువల్ కంటే కమ్యూనిటీనే మనకు పెద్ద స్ట్రెంగ్త్ అవుతుందని, కమ్యూనిటీకే రాజకీయాలు ముడిపడి ఉంటాయని వివరించారు. తమకు అమరావతి తోనో లేదా ఇతర రాష్ట్రాలతోనో పోటీ లేదని, తాము నేరుగా చైనా, జపాన్ వంటి దేశాలతో పోటీ పడుతున్నామని ప్రకటించారు. మన్మోహన్ సింగ్ తెచ్చిన ఆర్థిక విధానాలతోనే దేశంలో పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమైందని, మన వాళ్లు కంపెనీలకు యజమానులు అయినప్పుడే ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఆకాంక్షించారు. మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న కంపెనీలు, దేశాలే ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాయని, అందుకే తెలంగాణలో మహిళలను విశేషంగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారిని కేవలం ఆర్టీసీ ప్రయాణానికే పరిమితం చేయకుండా బస్సులకే యజమానులను చేశామని, పెట్రోల్ బంక్ లు, విద్యుత్ ప్లాంట్లు కూడా ఇస్తున్నామని వెల్లడించారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి పాలసీ పెరాలసిస్ లేదని, పారిశ్రామిక వేత్తలకు ఉపయోగపడే విధానాలను తాము మార్చడం లేదని, పెట్టుబడులకు పూర్తి భరోసా ఇస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

