Site icon NTV Telugu

Off The Record: ప్రభాకర్ రావుది నేర విచారణ లేక రాజకీయ వేధింపా .. ?

Phone Tapping Case

Phone Tapping Case

Off The Record: తాను పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు అప్పటి ఇంటెలిజెన్స్‌ ఐజీ ప్రభాకర్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌తో వేధించాడని, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి. ప్రభాకర్‌రావును ఎలాగైనా జైలు ఊచలు లెక్కబెట్టేలా చేస్తానని అప్పట్లో అన్నారాయన. ఇప్పడు జరుగుతున్న పరిణామాల్ని చూస్తుంటే… అదే నిజం అవుతోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రివెంజ్ను తలపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. బీఆర్ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభాకర్‌రావు తన వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని నాశనం చేశారంటూ బహిరంగంగానే ఆరోపించారు రేవంత్‌రెడ్డి. నన్ను వేధించిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతానని అప్పట్లో సూటిగానే చెప్పేశారు.

READ ALSO: MLA Madhavaram: IDPL ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ సర్కార్..

అప్పుడు అన్న మాటలకు ఇప్పుడు కనిపిస్తున్నది కార్యరూపమా అన్న చర్చలు జరుగుతున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌లో. కాలం మారింది, ప్రభుత్వం మారింది, అధికారం కాంగ్రెస్ చేతుల్లోకి వచ్చింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. అమెరికాలో ఉన్న ప్రభాకర్‌రావును భారతదేశానికి రప్పించగలిగింది. కోర్టు పరిధిలోబెయిల్ రద్దు అంశం తెరపైకి వచ్చింది. ఇక దర్యాప్తులో భాగంగా ప్రభాకర్‌రావు పోలీస్ స్టేషన్‌లో విచారణ ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. దాంతో రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలే ఇప్పుడు చర్యలుగా మారాయా? లేదా ఇది పూర్తిగా చట్టపరమైన ప్రక్రియేనా? ప్రభాకర్‌రావు ఎదుర్కొంటున్న పరిణామాలు నిజంగా నేర విచారణా? లేదా రాజకీయ కక్ష సాధింపా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అటు బీఆర్‌ఎస్ వర్గాలు మాత్రం ఇదంతా రివెంజ్ పాలిటిక్స్ అంటూ మండిపడుతున్నాయి. అప్పటి వ్యక్తిగత కక్షను ఇప్పుడు అధికారంతో తీర్చుకుంటున్నారన్నది గులాబీ ఆరోపణ. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం చట్టం తన పని తాను చేస్తోందని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి ఎవ్వరి కోసం ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు కాంగ్రెస్‌ లీడర్స్‌. ఫోన్ ట్యాపింగ్ లాంటి తీవ్రమైన అంశంలోనిజాలు బయటకు రావాలంటే విచారణ తప్పదన్నది ప్రభుత్వ వాదన. అయితే అసలు ప్రశ్న ఒక్కటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్న మాటలు అధికారంలోకి రాగానే నిజమవుతాయా? రేవంత్ రెడ్డి సవాల్ ఇప్పుడు చట్టబద్ధ చర్యగా మారిందా? లేదా ఇది రాజకీయ ప్రతీకారానికి మరో అధ్యాయమా? అంటూ ప్రభాకర్‌రావు కేసు తెలంగాణ రాజకీయాలను మరోసారి ఉత్కంఠకు గురిచేస్తోంది. ఇది బాధితులకు న్యాయం దిశగా వేసిన అడుగా లేదా ప్రతీకార రాజకీయమా అన్నది రాబోయే రోజుల్లో కోర్టుల్లో తేలిపోతుంది.

READ ALSO: Minister Nara Lokesh: క్లస్టర్ బేస్డ్ అభివృద్ధి విధానం పాటిస్తున్నాం..

Exit mobile version