Site icon NTV Telugu

AB Venkateswara Rao: రాజకీయాల్లోకి వస్తాను.. మాజీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు

Av Venkateswara Rao

Av Venkateswara Rao

AB Venkateswara Rao: అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన ప్రెస్ మీట్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.., “నాకు ఈరోజు లిఫ్ లాగా ఉంది. నా జీవితంలో కాళ్లు చేతులు ఆడినంతకాలం సమాజం కోసం పనిచేస్తాను” అంటూ తన ఆలోచనని ప్రకటించారు. మాట ప్రకారం నడుచుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ఆయన అన్నారు. ఇకపై రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం, సమాజం కోసం పనిచేస్తానని స్పష్టంగా వెల్లడించారు.

రాజకీయాల పట్ల తన నిర్ణయాన్ని తెలియజేస్తూ.. రాజకీయాలు అంటే పదవులు గాని, అధికారం గాని కావు. సమాజ స్థితిగతులను అవగాహన చేసుకుని, జరిగిన తప్పులను సరిదిద్దడమే నా లక్ష్యం అని ఆయన చెప్పారు. ప్రజలకు నిజమైన అవగాహన కల్పించడమే తన రాజకీయ ప్రవేశం వెనుక ఉద్దేశమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏవి వెంకటేశ్వరరావు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను రాష్ట్రానికి పొంచి ఉన్న అతిపెద్ద ఉపద్రవంగా ఆయన అభివర్ణించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎంత విధ్వంసం చవిచూసిందో మనం కళ్లారా చూశాం అని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలపై ఆయన పాలన గౌరవం చూపలేదని, ప్రజాస్వేచ్ఛల పట్ల అసహనం ఉన్న పాలనగా అభివర్ణించారు.

జగన్ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం మరింత వెనక్కి పోతుందన్న భయాన్ని ప్రజల్లో ఉన్నదిగా పేర్కొన్నారు. “నెవర్ ఎగైన్ నెవర్ అగైన్ ” అనే సంకల్పంతో ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ పార్టీ అవినీతి, అరాచకాలు, హత్యలతో ప్రజలను భయపెట్టిన విధానాన్ని విమర్శించారు. జగన్‌ను “మోసగాడు”గా వర్ణించిన ఆయన, ఏమాత్రం సభ్యత లేకుండా మాట్లాడటం జగన్ నైజం అని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విడదీసి లబ్ధి పొందాలన్న జగన్ ప్రయత్నాన్ని ఖండించారు. ప్రజలందరూ ఈ విషయంపై ఆలోచించి, జగన్‌ను అంటిపెట్టుకుని ఉన్న నాయకులను దూరం చేయాలని ప్రజల తరఫున కోరారు. ఇక కోడికత్తి శ్రీను విషయాన్ని ప్రస్తావిస్తూ.., జగన్ ముఖ్యమంత్రి కావాలని కోడి కత్తి శ్రీను ప్రాణాల వరకు సాహసం చేశాడు. అలాంటి వ్యక్తిని శిక్షించారు. కానీ, జగన్ మాత్రం కోర్టుకు రావడం తప్పించుకుంటూ వాయిదాలు వేస్తున్నారని ఆరోపించారు.

Exit mobile version