హైదరాబాద్ లో వాహన రద్దీ నెలకొంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు. ప్రజా స్వామ్యంలో ఓటు కీలకమైంది. ప్రతి ఓటు విలువైనది. ఒక్క ఓటుతో తలరాతలు సైతం మారుతుంటాయి. అలాంటి వజ్రాయుధం లాంటి ఓటు వేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదని భావిస్తున్నారు.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ఓటర్లు. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఓట్ల పండుగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. అయినా.. రాష్ట్ర భవిష్యత్ కోసం ఎలాగైనా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకుని సరైన నాయకుడి ఎన్నుకుంటామని చెబుతున్నారు.
READ MORE: Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్ రోడ్ షో.. బహిరంగ సభపై సస్పెన్స్..
కొందరు సొంత వాహనాల్లో వెళ్తుండగా.. మరి కొందరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. పది రోజుల నుంచే బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి, సాగర్ రింగ్‌రోడ్డు బస్టాప్‌లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు కేటాయించింది. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉంది.