Republic Day Security Alert: రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న వేళ దేశ భద్రతపై ఇంటెలిజెన్స్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. జనవరి 26న ఢిల్లీలో ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని గూఢచార వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ మద్దతుతో పనిచేస్తున్న ఉగ్రవాదులు ఈ దాడులకు పథకం వేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ మార్గంగా భారత్‌లోకి చొరబడే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. వీరి వద్ద పేలుడు పదార్థాలు ఉన్నట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. అధికారులు భారత్–బంగ్లాదేశ్ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే దేశంలో ఉన్న బంగ్లాదేశ్ పౌరుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ అంశంపై ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం కూడా జరిగింది.
READ MORE: MS Dhoni: ఎవరు గెలిచినా నా జట్టు సీఎస్కేనే.. ఆర్సీబీ ఐపీఎల్ తొలి ట్రోఫీపై ధోనీ కామెంట్స్ వైరల్
ఇదే సమయంలో గురపత్వంత్ సింగ్ పన్నున్ నేతృత్వంలోని ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే సంస్థ కూడా రిపబ్లిక్ డే సమయంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఉన్న తమ రహస్య అనుచరులను సంప్రదించినట్లు సమాచారం. ఈ గుంపులు నల్ల జెండాలు ప్రదర్శించడం, ఖలిస్థాన్‌కు మద్దతుగా పోస్టర్లు అంటించడం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విరగ్గొట్టడం వంటి చర్యలతో రిపబ్లిక్ డే వేడుకలకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పంజాబ్‌లో రైల్వే పట్టాలపై దాడులు చేసే ప్రయత్నం ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
READ MORE: Anil Ravipudi: నా తొమ్మిది సినిమాల్లో ఆ మూవీ సీక్వెల్ చేయాలని ఉంది..
ఈ హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. ఢిల్లీలో పోలీసులు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ముఖాలను వెంటనే గుర్తించేలా ఏఐ స్మార్ట్ గ్లాసులను పోలీసులు వినియోగిస్తున్నారు. ఇవి జనసమూహాల్లో అనుమానాస్పద వ్యక్తులను వెంటనే గుర్తించడంలో సహాయపడతాయి. జమ్మూ కశ్మీర్‌లో కూడా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అక్కడి డీజీపీ నలిన్ ప్రభాత్ అధికారులతో సమావేశమై, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
