Site icon NTV Telugu

Governor Jishnu Dev Varma: పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా అడుగులు..!

Image

Image

Governor Jishnu Dev Varma: పరేడ్ గ్రౌండ్ లో 77వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద గవర్నర్ నివాళులు అర్పించారు. ఆపై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు గవర్నర్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ అనే దార్శనిక పత్రాన్ని ఆవిష్కరించింది. ఈ పత్రం ద్వారా సమగ్ర, సమానమైన, సుస్థిర అభివృద్ధికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచింది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న మహత్తర లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారు.

గత డిసెంబరులో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా ప్రపంచ ప్రతినిధుల సమక్షంలో ఈ దార్శనిక పత్రాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. దేశాభివృద్ధిలో తెలంగాణను కీలక పాత్రధారిగా నిలబెట్టడమే ఈ విజన్–2047 ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్–2047 ప్రణాళికలో భాగంగా అనేక కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టనున్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు (బాపూఘాట్), గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, డ్రై పోర్టులు, మెట్రో రైలు రెండో దశ, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల నిర్మాణం ఇందులో భాగం. అలాగే హైదరాబాద్–నాగపూర్, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–విజయవాడ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి కూడా చేపట్టనున్నారు. ఇవన్నీ 2047 నాటికి తెలంగాణ ఆర్థిక ప్రగతికి బలమైన పునాది వేయనున్నాయి.

Republic day 2026: 150 వసంతాల స్ఫూర్తి.. గణతంత్ర దినోత్సవ ప్రత్యేక గీతం..!

రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తూ సాగుకు అండగా నిలుస్తోంది. రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేయడం ద్వారా రూ.20,617 కోట్ల వ్యయంతో సుమారు 26 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు సంవత్సరానికి అందించే సహాయాన్ని రూ.10,000 నుంచి రూ.12,000కు పెంచి సాగు పెట్టుబడిని మరింత బలోపేతం చేసింది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. సన్న ధాన్యంపై క్వింటాలుకు రూ.500 బోనస్ కూడా అందిస్తోంది.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 14.24 లక్షల మంది రైతుల నుంచి 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా, ఇప్పటివరకు రూ.17,079.50 కోట్ల చెల్లింపులు జరిగాయి. అదనంగా రూ.1,453 కోట్లను బోనస్ సబ్సిడీగా పంపిణీ చేశారు. బలమైన వ్యవసాయ మౌలిక వసతుల కారణంగా తెలంగాణ దేశంలోనే వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తూ అంతర్జాతీయ మార్కెట్లలోనూ రాష్ట్రం తన సత్తాను చాటుతోంది.

రైతుల ఆర్థికాభివృద్ధికి స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతలు, మట్టిసార నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తొలిసారిగా ఫార్మర్ కమిషన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఉత్పాదకత పెరిగి, రైతులపై రుణ భారం తగ్గనుంది. ఇప్పటివరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తదితర సంస్థల ద్వారా 62,749 మంది యువతకు ఉద్యోగాలు కల్పించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు “డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (DEET)”ను ప్రారంభించారు.

Padma Awards 2026: చాంపియన్లకు ‘పద్మ’ గౌరవం.. క్రీడారంగంలో అవార్డు సాధించిన ఫుల్ లిస్ట్ ఇదిగో..!

పర్యావరణ పరిరక్షణ దిశగా హెచ్‌ఐఎల్‌టీ విధానంతో కాలుష్య పరిశ్రమలను నగరం బయటకు తరలించే ప్రక్రియను చేపట్టారు. ముచ్చర్ల, కందుకూరు ప్రాంతాల్లో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. ఇది నెట్-జీరో స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుంది. ఇంకా మూసీ నది పునరుజ్జీవనానికి 55 కి.మీ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. చెరువుల ఆక్రమణల నివారణకు హైడ్రా సంస్థను ఏర్పాటు చేశారు. అంబర్‌పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించడం ద్వారా జల వనరుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా హ్యామ్ మోడల్‌లో 12,000 కి.మీ రహదారుల అభివృద్ధికి రూ.11,399 కోట్లు, గ్రామీణ రహదారుల కోసం రూ.16,007 కోట్లు ప్రతిపాదించారు.

Exit mobile version