NTV Telugu Site icon

AP Governor: ఏపీపై అప్పుల భారం ఎక్కువగా ఉంది: గవర్నర్

Governor Syed Abdul Nazeer

Governor Syed Abdul Nazeer

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం ఎక్కువగా ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం అని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారని, ఓ చారిత్రాత్మక విజయం అని పేర్కొన్నారు. భారీ విజయం కట్టబెట్టిన ప్రజల నమ్మకంను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగగా.. గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ… ‘అందరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఏపీపై అప్పుల భారం ఎక్కువగా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారు. ఒక చారిత్రాత్మక విజయం దక్కింది. ప్రజల నమ్మకం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రతి సవాల్‌ను అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఇప్పటివరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం. ఆర్థిక క్రమశిక్షణ ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటున్నాం. కేంద్రం నుంచి అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్‌కు అన్ని విధాలా సహకారం అందుతోంది. స్వర్ణాంధ్ర 2047కు ఒక రోడ్ మాప్ తయారు చేస్తున్నాం. ‘ఆరోగ్యం-ఐశ్వర్యం-ఆనందం’ ఇదే ప్రభుత్వ నినాదం’ అని చెప్పారు.

‘పది సూత్రాల ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం. ప్రతి గ్రామం, ప్రతి వర్గంలో అభివృద్ధి ఉండాలి. పేదరికం లేని సమాజంపై దృష్టి పెట్టాము. ఉద్యోగాల కల్పన ప్రధాన సమస్య. కోస్తా తీరాన్ని అంతర్జాతీయ సరిహద్దుగా సమన్వయం చేసుకుని అభివృద్ధిపై దృష్టి పెడతాము. అందరికి మంచి నీరు, జీవన ప్రమాణాలు పెంచడం ప్రభుత్వ బాధ్యత. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టనర్షిప్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. పేదరికం లేకుండా చేయడమే ప్రధాన కర్తవ్యం. హ్యాపీ సండే పేరుతో ప్రజలకు ఆహ్లాద పరిచే కార్యక్రమాలు నిర్వహించబోతున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ప్రజల జీవనాడి. 2026 చివరికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నదుల అనుసంధానం ఒక గేమ్ ఛేంజర్. ప్రకృతి వ్యవసాయానికి ఆంధ్రప్రదేశ్ ఒక హబ్ అవుతుంది. ఏఐ ఐవోటి డ్రోన్.. రోబోటిక్ సాటిలైట్ టెక్నాలజీ సహాయంతో అభివృద్ధిపై దృష్టి పెడతాం’ అని గవర్నర్ చెప్పుకొచ్చారు.