RBI: ప్రస్తుతం నిత్యవసరాల ధరలు నింగిని తాకుతున్నాయి. మొన్నటి వరకు టమాటా ధరలు చుక్కలు చూపించాయి. పప్పుధాన్యాల ధరలు కూడా రాకెట్ లా దూసుకుపోతున్నాయి. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఏమి కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతొ దేశంలో ద్రవోల్బణం కూడా విపరీతంగా పెరుగుతోంది. ఇది ఆర్థికాభివృద్దికి అంతమంచిది కాదు. ఈ నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగే ఒక విషయాన్ని వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్. సెప్టెంబర్ నుంచి కూరగాయల ధరలు తగ్గవచ్చని పేర్కొన్నారు. లలిత్ దోషి స్మారకోపన్యాసంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also read: Tamilnaadu: యూట్యూబ్ చూసి భార్యకు ప్రసవం చేసిన భర్త.. భార్య మృతి
దేశంలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ అది క్రమక్రమంగా తగ్గుతోందని శక్తికాంత్ దాస్ తెలిపారు. మొన్నటి వరకు పెరిగిన టమాటా ధరలు ప్రస్తుతం చాలా తగ్గాయని, ఇక పెరుగుతాయనుకున్న ఉల్లి ధరలను ప్రభుత్వం కట్టడి చేసిందని ఆయన పేర్కొ్న్నారు. ద్రవోల్బణాన్ని తగ్గించేందుకు ఆర్బీఐ చేపడుతున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయనడానికి ఇది రుజువన్నారు. ఇటీవల కాలంలో కూరగాయలు, చిరుధాన్యాల ధరలు పెరగడంతో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దీనిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన ఆర్బీఐ గతేడాది మే నుంచీ వడ్డీ రేట్లను 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. సుస్థిరాభివృద్ధికి ధరల్లో స్థిరత్వం కీలకమని ఆయన తెలిపారు. సరఫరా పెరిగితే ధరలు తగ్గే అవకాశం ఉందని అందుకే ధరల స్థిరీకరణ కోసం సరఫరా పై దృష్టి సారించాలని శక్తి కాంత దాస్ కోరారు. ఇక ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్న లక్ష్యానికి కేంద్ర బ్యాంకు కట్టుబడి ఉందని ఆర్బీఐ చీఫ్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని, విదేశీ నిల్వలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రూపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం డాలర్ల నిల్వను ఉంచుకోవడం అవసరమని తెలిపరు. మొత్తానికైతే వచ్చే నెల నుంచి కూరగాయల ధరలు తగ్గుతాయని చెప్పడం మాత్రం సామాన్యులకు పెద్ద ఊరట కలిగించే విషయమని చెప్పవచ్చు.