Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!

Reliance

Reliance

Reliance Group: స్టాక్ మార్కెట్లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (Jio Platforms) బ్లాక్‌బస్టర్ అరంగేట్రం చేయడంతో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సరికొత్త రికార్డును సృష్టించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) పరంగా దేశ కార్పొరేట్ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలిచింది. దీనితో ఇప్పుడు ఇన్నాళ్లూ అగ్రస్థానంలో కొనసాగిన టాటా గ్రూప్‌ను వెనక్కి నెట్టి, కార్పొరేట్ మార్కెట్ క్యాప్ లీగ్‌లో రిలయన్స్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం రిలయన్స్ గ్రూప్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీల మొత్తం సంయుక్త మార్కెట్ విలువ రూ. 30.5 లక్షల కోట్ల మైలురాయిని దాటింది.

నేడు (అక్టోబర్ 28) బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) ఎక్స్ఛేంజీలలో జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు 21 శాతానికి పైగా ప్రీమియంతో రూ. 1,358 వద్ద లిస్ట్ అయ్యాయి. ఐపీఓలో ఈ షేరు ఇష్యూ ధర రూ. 1,119గా నిర్ణయించగా.. ఇన్వెస్టర్లకు మొదటి రోజే అదిరిపోయే లిస్టింగ్ గెయిన్స్ లభించాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 12.50 లక్షల కోట్ల మార్కును దాటింది. ఈ భారీ లిస్టింగ్‌తో రూ. 10 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ కలిగిన దిగ్గజ భారత కంపెనీల ఎలైట్ క్లబ్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ చేరింది. రూ. 12.50 లక్షల కోట్ల మార్కెట్ విలువతో తన మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తర్వాతి స్థానంలో నిలిచింది. దీంతో దేశంలో అత్యంత విలువైన టాప్ 2 లిస్టెడ్ కంపెనీలు (RIL, Jio Platforms) రిలయన్స్ గ్రూప్ ఖాతాలోనే ఉన్నాయి. ఇక టెలికాం రంగంలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. విలువైన టెలికాం కంపెనీల జాబితాలో భారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానానికి పడిపోయింది.

మార్చి 2026తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ ఏకంగా రూ. 30,049 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1.5 లక్షల కోట్లుగా నమోదు కాగా, ఎబిటా (EBITDA) మార్జిన్ 52 శాతంగా నిలిచింది. మొత్తం రిలయన్స్ గ్రూప్‌లోని 11 లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా దాదాపు 53% ఉండగా, కొత్తగా చేరిన జియో ప్లాట్‌ఫామ్స్ వాటా 42%గా ఉంది. ఈ ఐపీఓ లిస్టింగ్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటా 66.4% నుంచి 64.5%కి చేరింది.

ఐటీ, ఆటోమొబైల్, స్టీల్, జువెలరీ తదితర రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్.. సంయుక్త మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో ఇప్పుడు రెండో స్థానానికి పరిమితమైంది. టాటా గ్రూప్ మొత్తం సంయుక్త మార్కెట్ విలువలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వాటా దాదాపు 37%గా ఉండగా.. టైటాన్ (Titan) వాటా 16%, టాటా స్టీల్ వాటా 9% మేర ఉంది. ట్రెంట్ (Trent), టాటా మోటార్స్ సంస్థలు చెరో 6% పైగా మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి.