తలసేమియా వ్యాధితో బాధపడుతున్న మూడు సంవత్సరాల బాలుడికి రక్తం ఎక్కించడం ద్వారా హెచ్‌ఐవీ సోకిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారానే ఆ బాలుడికి బ్లడ్ ఎక్కించారు. అయితే బ్లడ్ బ్యాంక్ నిర్లక్ష్యం కారణంగానే హెచ్‌ఐవీ సోకిన వ్యక్తి బ్లడ్ మూడు సంవత్సరాలు బాలుడి ఎక్కించడంతో ఇప్పుడు బాలుడికి కూడా హెచ్‌ఐవీ సోకినట్లు రిపోర్టలో తేలింది. ఈ నేపథ్యంలో.. తాజాగా.. ఎన్టీవీతో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. తలసీమియా వ్యాధితో బాధపడుతున్న మూడున్నర ఏళ్ల బాలుడికి తమ బ్లడ్ బ్యాంక్ నుండి బ్లడ్ ఎక్కిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 42 సార్లు అతనికి బ్లడ్ ఎక్కించామని, అతనికి హెచ్ఐవీ సోకిందని రీసెంట్ గా టెస్ట్ చేసి తానే పేరెంట్స్ కి చెప్పానని, అబ్బాయి ద్వారా ఇంకొకరికి సోకకూడదని ఆ విషయాన్ని పేరెంట్స్ కు చెప్పామన్నారు. తమ దగ్గర బ్లడ్ ఇచ్చే వాళ్ళ శాంపిల్స్ కు ఐదు రకాల టెస్టులు చేస్తామని, అందులో హెచ్ఐవీ టెస్ట్ కూడా ఉంటుందన్నారు.
ఈ ఐదు టెస్టుల్లో ఏది పాజిటివ్ అని వచ్చిన బ్లడ్ ను డిస్పోజ్ చేస్తామన్నారు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఇలాంటి వైరస్ బారిన పడి ఉంటే అతనికి సోకిన తర్వాత 8 వారాలకు బయటపడుతుందని, దీన్నే విండో పీరియడ్ అంటారని ఆయన వివరించారు. దాతలు ఇచ్చిన రక్తం కేవలం 32 రోజుల వరకు ఉంటుందని, ఆ తర్వాత పనికిరాదని ఆయన తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన అన్నారు. బాబు జీవించి ఉన్నంతకాలం తమ బ్లడ్ బ్యాంక్ నుండి అతనికి అవసరమైన సహాయం అందిస్తూనే ఉంటామని ఆయన వెల్లడించారు.
