Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!

Rain Alert

Rain Alert

Red Alert: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కళింగపట్నానికి సమీపంలో దాటే అవకాశం ఉంది. దీనితో నాలుగు రాష్ట్రాలపై ప్రభావం పడనుంది. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్ తర్వాత ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అంటే ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.

మంగళవారం రాత్రి 11:30 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది వాయుగుండం. అలాగే విశాఖపట్నానికి ఈశాన్య దిశలో 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఒడిశాలోని గోపాల్పూర్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్లు, పూరీకి నైరుతి దిశగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని ఐఎండీ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో కళింగపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. నదీ పరివాహక ప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. వాయుగుండం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఉత్తరాంధ్రలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా అధికారులు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, మన్యం, అల్లూరి జిల్లాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వర్షాల తీవ్రత పెరిగితే ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది.

మరోవైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఇప్పటికే మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. వంశధార, నాగావళి నదుల్లో ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారింది. బంగాళ ఖాతలో ఏర్పడిన వాయుగుండం ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజామున కళింగపట్నానికి సమీపంలో దాటే అవకాశం ఉంది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారింది. కళింగపట్నానికి సమీపంలో ఉద్దానం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.