West Bengal: బెంగాల్ పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు జరిగిన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం అనేక పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను రద్దు చేసింది. జులై 10, సోమవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజా పోల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. బెంగాల్ పంచాయతీ ఎన్నికలకు సోమవారం 604 బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది.
ముర్షిదాబాద్‌లో 175 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. మాల్డాలో 112, నాడియాలో 89, ఉత్తర 24 పరగణాలలో 46, దక్షిణ 24 పరగణాలలో 36, పుర్బా మేదినీపూర్‌లో 31, హుగ్లీలో 29, దక్షిణ్ దినాజ్పూర్లో 18, జల్పాయిగురిలో 14, బీర్భూమ్లో 14, పశ్చిమ మేదినీపూర్‌లో 10, బంకురాలో 8, హౌరాలో 8, పశ్చిమ్ బర్ధమాన్‌లో 6, పురూలియాలో 4, పుర్బా బర్ధమాన్ 3, అలీపుర్దువార్లోని ఒక బూత్‌లో రీపోలింగ్ జరగనుంది. దక్షిణ 24 పరాగణాలలో 10, డైమండ్ హార్బర్లోని 36 బూత్‌లలో రీ-పోలింగ్ జరుగుతుంది. గోసాబా 5, జోయ్‌నగర్‌లో 5, బసంతిలో నాలుగు, కుల్తాలిలో 3, జోయ్‌నగర్ IIలో ఒక బూత్‌లో, మందిర్ బజార్లో రెండు, బిష్ణుపూర్, బరుయిపూర్, మధురాపూర్, మగ్రాహత్లలో ఒక్కొక్క బూత్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నారు.
Also Read: Chhattisgarh: ఎన్నికల ముసాయిదా మేనిఫెస్టో కోసం బీజేపీ ప్యానెల్ ఏర్పాటు
బెంగాల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. శనివారం హింసాత్మక వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో 19 మంది చనిపోయారు. పగటిపూట బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లను ధ్వంసం చేసిన అనేక సంఘటనలు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) జిల్లా మేజిస్ట్రేట్ (DM) నుంచి మరణాలు, హింసపై వివరణాత్మక నివేదికలను కోరింది. రాష్ట్రంలోని మూడంచెల పంచాయతీ వ్యవస్థలో మొత్తం 73,887 స్థానాలకు ఎన్నికలు జరగగా, లక్షా 2.06 లక్షల మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తాత్కాలికంగా 66.28 శాతం ఓటింగ్ నమోదైంది, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న 5.67 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులు.