Site icon NTV Telugu

RCB vs PBKS Final: విరాట్ ఇదే అద్భుత అవకాశం.. ఇప్పుడు కాకపోతే..!

Virat Kohli Rcb Trophy

Virat Kohli Rcb Trophy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ఎంతో మంది యువ ఆటగాళ్లు ట్రోఫీ అందుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం లీగ్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ జట్టులోని యువ ప్లేయర్స్ కూడా కప్పు అందుకున్నారు కానీ.. ఐపీఎల్ ఆరంభం నుంచి ఆడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ మాత్రం ఆ కలను నెరవేర్చుకోలేకపోయాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా దశాబ్దానికి పైగా ప్రయత్నించి విఫలమయ్యాడు. అంతేకాదు పలు సారథుల నాయకత్వంలో బ్యాటర్‌గా కష్టపడ్డా ఫలితం దక్కలేదు. అయితే ఎన్నో ఏళ్ల కలకు ఐపీఎల్ 2025లో విరాట్ చేరువయ్యాడు.

గతంలో కంటే 2020 నుంచి ఆర్సీబీ బాగా ఆడుతోందనే చెప్పాలి. 2020, 2021, 2022, 2024లో ప్లేఆఫ్స్‌ చేరింది. అయితే ఒత్తిడికి చిత్తై ఫైనల్ చేరలేదు. మూడుసార్లు ఎలిమినేటర్, ఓసారి క్వాలిఫయర్‌లో ఓడి నిరాశపరిచింది. ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ సారథ్యంలో పెద్దగా అంచనాలు లేకుండా ఆర్సీబీ బరిలోకి దిగింది. ఆరంభ మ్యాచ్ నుంచి గొప్పగా ఆడి అందరికంటే ముందుగా ఫైనల్‌ బెర్త్ దక్కించుకుంది. ఇంకొక్క మ్యాచ్‌లో గొప్ప ప్రదర్శన చేస్తే.. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది.

Also Read: RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20లు, టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొసనాగుతున్నాడు. 36 ఏళ్ల విరాట్ ఐపీఎల్‌లో కూడా ఇంకా ఎన్నో ఏళ్లు కొనసాగకపోవచ్చు. ఒకవేళ కోహ్లీ ఆడినా.. మళ్లీ ఆర్సీబీ ఇంత గొప్పగా ఆడి ఫైనల్‌ చేరుతుందా? అన్నదీ అనుమానమే. ఈ నేపథ్యంలో కప్పు అందుకోవడానికి కోహ్లీకి ఇదే అత్యుత్తమ అవకాశం. ఇప్పుడు కాకపోతే.. ఇంతటి అద్భుత అవకాశం మరలా ఎప్పుడు వస్తుందో చెప్పలేం. కింగ్ కోహ్లీకి ఆర్సీబీ కప్పును బహుమతిగా అందిస్తుందా? లేదో చూడాలి.

Exit mobile version