RBI Banking Reforms: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రధాన సంస్కరణలను అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. తాజాగా RBI 238 కొత్త బ్యాంకింగ్ నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. వీటిపై నవంబర్ 10 వరకు అభిప్రాయాలు కోరుతోంది. ప్రజల నుంచి, అభిప్రాయం బ్యాంకింగ్ సంస్థల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా నిబంధనలు 2026 నాటికి అమలు చేయనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఈ కొత్త నిబంధనలు కస్టమర్ రక్షణను మెరుగుపరచడం, బ్యాంకింగ్ సేవలను సరళీకృతం చేయడం, బ్యాంకులకు జవాబుదారీతనం నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని వెల్లడించింది.
సైబర్ మోసాలపై ఉక్కుపాదం..
ఎవరైనా ఒక కస్టమర్ ఖాతా సైబర్ మోసానికి గురైన మూడు రోజుల్లోపు బ్యాంకుకు సమాచారం అందిస్తే, కస్టమర్‌కు ఎటువంటి నష్టం జరగదని RBI పేర్కొంది. అంతేకాకుండా బాధిత కస్టమర్ ఫిర్యాదుకు బ్యాంకులు సకాలంలో చర్య తీసుకోవడంలో విఫలమైతే, సంబంధిత బ్యాంకులపై బాధితులు రూ.25 వేల వరకు జరిమానా విధించవచ్చని వెల్లడించింది. దీనివల్ల బ్యాంకులు సైబర్ భద్రత గురించి మరింత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. అలాగే లాకర్ సంబంధిత వివాదాలలో కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఒక పెద్ద మార్పు చేసినట్లు తెలిపింది. బ్యాంకు నిర్లక్ష్యం లేదా భద్రతా లోపం కారణంగా కస్టమర్ లాకర్ దొంగిలించబడినా లేదా దెబ్బతిన్నా, బ్యాంకు లాకర్ అద్దెకు 100 రెట్లు వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని తాజా ముసాయిదాలో తెలిపింది.
కొత్త నియమాలు KYC ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నాయి. సాధారణ ఖాతాల కోసం KYC ప్రతి 10 ఏళ్లకు ఒకసారి, మధ్యస్థ-రిస్క్ ఖాతాలకు ప్రతి 8 ఏళ్లకు ఒకసారి, అధిక-రిస్క్ కస్టమర్లకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పూర్తవుతుంది. ఇది వినియోగదారులకు పదే పదే పత్రాలను సమర్పించే ఇబ్బంది నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రుణ సంబంధిత విషయాలలో కూడా కస్టమర్లకు గణనీయమైన ఉపశమనం లభించనుంది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత అన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను నిర్ణయించడానికి ఏకరీతి సూత్రాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఇది బ్యాంకుల పారదర్శకతను నిర్ధారిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇంకా అన్ని రుణాలపై ముందస్తు చెల్లింపు జరిమానాలు పూర్తిగా తొలగించనున్నట్లు వెల్లడించింది. ఇది కస్టమర్‌లు ఎటువంటి అదనపు రుసుములు లేకుండా షెడ్యూల్‌కు ముందే తమ రుణాలను తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుందని తెలిపింది.
70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న కస్టమర్లకు ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని కూడా ఆర్బీఐ ప్రతిపాదించింది. దీని అర్థం వారు బ్యాంకులను సందర్శించాల్సిన అవసరం లేకుండా, బ్యాంకు అధికారులే వారి ఇంటి వద్ద అవసరమైన సేవలను అందిస్తారు. ప్రజలు, బ్యాంకుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ కొత్త నియమాలు జనవరి 1, 2026, ఏప్రిల్ 1, 2026 మధ్య దశలవారీగా అమలు చేయనున్నట్లు RBI పేర్కొంది. ఈ మార్పులు బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచుతాయని, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయని, బ్యాంకింగ్ వ్యవస్థను మరింత జవాబుదారీగా చేస్తాయని వెల్లడించింది.
READ ALSO: India Defence Deals: నవంబర్ 23న భారత ఆర్మీకి నిజమైన దీపావళి.. ఈ బాంబులు పడితే పాక్ భస్మమే!
