Rayapati Sambasiva Rao Passes Away: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో ప్రొస్టేట్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్న రాయపాటికి.. ఇటీవల వ్యాధి తిరగబెట్టడంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. రాయపాటి మృతి పట్ల రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1943 జూన్ 7న గుంటూరు జిల్లా ఉంగుటూరులో రాయపాటి సాంబశివరావు జన్మించారు. 1972లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆరుసార్లు ఎంపీగా సేవలందించారు. ఐదుసార్లు లోక్‌సభకు ఎన్నికవగా.. ఒకసారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాయపాటి.. 2014లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో విషాదం నెలకొంది.

