RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..

Raw Ntr Founder Sai Roop

Raw Ntr Founder Sai Roop

RAW NTR Founder Sai Roop: తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్ తమ సంస్థ చేపట్టనున్న ‘ఊరు–వాడ’ సేవా కార్యక్రమంపై వివరణ ఇచ్చారు. గత వారం రోజులుగా తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు, ప్రచారాల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్టీఆర్ పేరును దుర్వినియోగం చేసే ఉద్దేశం తమకు లేదని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు సాయిరూప్‌..

మూడు ప్రధాన అంశాల ఆధారంగా ‘ఊరు–వాడ’..

* మొదటిది ‘సేవతో యువ జాగృతి’. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా సమాజానికి ఉపయోగపడేలా, చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని వివరించారు. సేవ అంటే కేవలం అన్నదానం, రక్తదానం మాత్రమే కాదని, సమాజానికి ఉపయోగపడే ఏ మంచి పని చేసినా అది సేవేనని పేర్కొన్నారు.

* రెండో అంశం ‘మన ఊరు – మన బాధ్యత’ అని తెలిపారు సాయి రూప్.. గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలను గుర్తించి, స్థానిక ప్రజల సహకారంతో వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చెప్పారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా రైతు సదస్సులు నిర్వహించి, వ్యవసాయ రంగానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

* మూడో అంశం ‘ఊరి మాట పాలకుల దాకా’ అని సాయి రూప్ తెలిపారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లే వేదికగా ఈ కార్యక్రమం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల గొంతుకను పాలకులకు వినిపించడం కూడా తమ సేవా కార్యక్రమంలో భాగమేనని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ అభిమానులు గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, అలాంటి సేవలను మరెవ్వరూ చేయలేదని సాయి రూప్ అన్నారు. తాము కూడా ఎన్టీఆర్ నాటిన సేవా భావానికి కొనసాగింపుగా వచ్చిన ఒక చిన్న విత్తనమేనని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల తమపై ‘వంద కోట్ల మోసం’, ‘అభిమానుల ముసుగులో దందా’ వంటి ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్న సాయి రూప్, ‘ఊరు–వాడ’ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని ఒక గ్రామం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమం పూర్తిగా సేవా దృక్పథంతోనే కొనసాగుతుందని, సమాజాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు రా ఎన్టీఆర్ (RAW NTR) సంస్థ వ్యవస్థాపకుడు సాయి రూప్.