RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్‌పై సస్పెన్స్‌..

Raw Ntr Controversy

Raw Ntr Controversy

RAW NTR Controversy: తిరుపతిలో నేడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం నిర్వహించనున్న ప్రెస్ మీట్ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ‘RAW NTR’ పేరుతో వెలుగులోకి వచ్చిన సంస్థ, ఎన్టీఆర్ పేరుతో రూ.100 కోట్ల విలువైన ‘మా ఊరు–వాడ’ సేవా కార్యక్రమం ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలు కీలక అంశాలను వెల్లడిస్తామని ‘రా ఎన్టీఆర్’ సంస్థ నిర్వాహకుడు సాయి రూప్ ప్రకటించారు.

తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ ప్రెస్ మీట్ జరగనుంది. వివాదాల నేపథ్యంలో భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో హోటల్ యాజమాన్యం పోలీసు భద్రతను కోరినట్లు సమాచారం. దీంతో ఈ సమావేశంపై అభిమానులతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా, ‘రా ఎన్టీఆర్’ సంస్థకు తమకు ఎలాంటి సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. అలాగే ఎన్టీఆర్ అభిమానుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కృష్ణ యాదవ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటన చేశారు. ఎన్టీఆర్ పేరు, ఫొటోలను ఉపయోగించి విరాళాలు సేకరిస్తున్నారంటూ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కృష్ణ యాదవ్ తిరుపతి జిల్లా అదనపు ఎస్పీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పేరు, అభిమానులను ఉపయోగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు. అలాగే రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీయగా, నేడు జరగనున్న ప్రెస్ మీట్‌లో ‘రా ఎన్టీఆర్’ సంస్థ ఎలాంటి వివరణ ఇస్తుందన్న దానిపై అభిమానులు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.