Site icon NTV Telugu

Ravindra Jadeja: హీరోనా లేదా విలనా?.. లార్డ్స్‌లో జడేజా ఇన్నింగ్స్‌పై దిగ్గజాలు ఏమన్నారంటే?

Jadeja Lord’s Innings

Jadeja Lord’s Innings

Ravindra Jadeja’s innings at Lord’s: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భారత్‌ను మ్యాచ్‌లో నిలబెట్టడానికి పోరాట ఇన్నింగ్స్ ఆడాడు. జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్, బ్రైడాన్ కార్స్‌ల పదునైన ఫాస్ట్ బౌలింగ్ ముందు టీమిండియా టాప్ అండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. ఓ సమయంలో భారత్ స్కోరు 7 వికెట్లకు 82 కాగా.. కాసేపటికి 8 వికెట్లకు 112గా మారింది. ఈ సమయంలో ఇంగ్లండ్ ఉదయం సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించేస్తుంది అందరూ అనుకున్నారు. కానీ జడేజా బాధ్యత తీసుకుని.. చివరి వరకూ పోరాడాడు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ అండతో ఆటను చివరి సెషన్ వరకూ తీసుకెళ్లాడు.

క్రిస్ వోక్స్ వేసిన 48వ ఓవర్‌లో రవీంద్ర జడేజా సిక్స్ కొట్టి తన ఉద్దేశ్యాన్ని చూపించాడు. కానీ ఆ తర్వాత 107 బంతుల వరకు బౌండరీ కొట్టలేదు. స్టోక్స్, కార్స్, ఆర్చర్‌ల బౌలింగ్‌లోనే కాకుండా.. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్, జో రూట్ బౌలింగ్‌లో కూడా జడేజా రిస్క్ తీసుకోలేదు. విజయానికి చేరువగా వచ్చిన సమయంలో సిరాజ్ బోల్డ్ అవ్వడంతో భారత్ లక్ష్యానికి 22 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జడేజా ఇన్నింగ్స్‌పై భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే స్పందించారు. జడేజా కొంచెం రిస్క్ తీసుకొని ఆడాల్సిందని అభిప్రాయపడ్డారు. వోక్స్ సహా స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగితే.. టీమిండియా లక్ష్యానికి దగ్గరగా వచ్చేదన్నారు.

Also Read: Mitchell Starc: స్టార్క్‌ అరుదైన ఘనత.. టెస్ట్ క్రికెట్‌ చరిత్రలోనే మొదటిసారి!

‘రూట్, బషీర్, వోక్స్‌ బౌలింగ్‌లో జడేజా రిస్క్ తీసుకోవాల్సింది. రూట్-బషీర్ ఆఫ్ స్పిన్నర్లు అని తెలుసు. కానీ లార్డ్స్‌లో బంతి ఎక్కువగా తిరగ లేదు. కాబట్టి అవుట్‌సైడ్ ఎడ్జ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జడేజా కఠినమైన పిచ్‌లపై మెరుగైన బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడు ఒకటి లేదా రెండు అవకాశాలను తీసుకొని ఉండాల్సిందని నేను అనుకున్నాను. బుమ్రా, సిరాజ్ క్రీజులో ఉన్నందున ఇంకొన్ని సింగిల్స్, డబుల్స్ తీస్తే బాగుండేది. జడ్డు రిస్క్ తీసుకుని 1-2 భారీ షాట్లు ఆడితే ఫలితం మరోలా ఉండేది’ అని అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఆ పరిస్థితిలో జడేజా పెద్దగా ఏమీ చేయలేడని టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నారు. జడేజా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో ఆడాడని, వీలైనంత వరకు స్ట్రైక్‌ను తానే తీసుకునేందుకు ప్రయత్నించాడన్నారు. బంతిని గాల్లో లేపడానికి సాహసం చేయలేదని సన్నీ చెప్పుకొచ్చారు.

Exit mobile version