ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది చెన్నై సూపర్‌కింగ్స్ సారథి మహేంద్రసింగ్ ధోనీనే. అతడి సారథ్యంలో చెన్నై జట్టు అత్యధిక సార్లు ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. నాలుగు సార్లు ట్రోఫీని కూడా గెలుచుకుంది. అయితే వచ్చే ఐపీఎల్‌లో ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. జట్టు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ వారసుడిగా రవీంద్ర జడేజా చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును నడిపించనున్నాడని సమాచారం.
Read Also: కోహ్లీ వారసుడు ఎవరు..? రేస్‌లో ఆ ఐదుగురు..!
ఈ ఏడాది ధోనీ పర్యవేక్షణలోనే జడేజాను సారథిగా సిద్ధం చేయాలని సీఎస్‌కే యాజమాన్యం రంగం సిద్ధం చేసింది. ఈ విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ఐపీఎల్ 2022 సీజన్ ధోనీ కెరీర్‌లో చివరి సీజన్ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌లోనే ధోనీ ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతాడని ప్రచారం జరిగింది. అయితే 2021 ఐపీఎల్ దుబాయ్‌లో జరగడంతో ధోనీ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. సొంత మైదానంలో అభిమానుల మధ్య ఐపీఎల్‌కు వీడ్కోలు పలకాలని ధోనీ భావించాడు. తాజా పరిణామాల మేరకు ధోనీ సూచనలతోనే సీఎస్‌కే టీమ్ రవీంద్ర జడేజాను రూ.16 కోట్లకు రిటైన్ చేసుకుంది. మరోవైపు ధోనీని మాత్రం రూ.12కోట్లకే సొంతం చేసుకుంది.
