టీమిండియా స్టార్ స్పిన్నర్, ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న రవీంద్ర జడేజాకు అంతర్జాతీయ క్రికెట్ మండలి షాకిచ్చింది. నాగ్‌పూర్ టెస్టులో ఈ ఇండియన్ ఆల్‌రౌండర్ ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది. దీంతో అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళికి చెందిన ఆర్టికల్ 2.20ను జడేజా అతిక్రమించినట్లు తేలింది. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని ఐసీసీ వెల్లడించింది.
Also Read: Air Asia: ఎయిర్ ఏసియాకు రూ.20 లక్షలు ఫైన్..కారణమిదే!
క్రమశిక్షణా చర్యల కింద జడేజాకు జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. గడిచిన 24 నెలల కాలంలో జడేజాకు ఇది తొలి తప్పుగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నాడు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 46వ ఓవర్‌లో జడేజా తన ఇండెక్స్ ఫింగర్‌కు ఆయింట్‌మెంట్‌ను అప్లై చేశాడు. సిరాజ్ నుంచి క్రీమ్ తీసుకున్న అతను ఎడమ చేతి చూపుడువేలికి రుద్దాడు. ఇండెక్స్ ఫింగర్‌కు వాపు రావడం వల్ల జడేజా ఈ క్రీమ్ రద్దుకున్నట్లు టీమ్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. అయితే ఆన్ ఫీల్డ్ అంపైర్ల పర్మిషన్ లేకుండా అలా చేసినందుకు అతనిపై చర్యలు తీసుకున్నారు. ఈ తప్పును జడేజా అంగీకరించాడు. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ ఆండీ పైక్రాఫ్ట్ ఈ శిక్షను ఖరారు చేశారు. లెవల్ వన్ ఉల్లంఘన కింద జడేజాకు మ్యాచ్ ఫీజులో కోత విధించారు.