Ashwin: ‘వైభవ్ నీళ్లు మోయడం అవమానం కాదు’.. విమర్శకులకు అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్!

Ravichandran Ashwin

Ravichandran Ashwin

Ravichandran Ashwin: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో తుది జట్టులోకి తీసుకోకపోవడాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సమర్థించాడు. అదే సమయంలో తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. 15 ఏళ్ల కుర్రాడు సీనియర్ ఆటగాళ్లకు వాటర్ బాటిళ్లు అందిస్తూ (డ్రింక్స్ మోస్తూ), డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని అలవాటు చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేయడమే కాకుండా, ఆ తర్వాత శ్రీలంకలో జరిగిన త్రైపాక్షిక సిరీస్‌లో ఇండియా-ఏ తరఫున లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించినప్పటికీ.. వైభవ్‌కు ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం లభించలేదు. ఐర్లాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో అతనికి చోటు దక్కకపోవడంపై అశ్విన్ గతంలో స్పందిస్తూ.. “బయట కూర్చుని మ్యాచ్‌ను వీక్షించడంలో, జాతీయ జట్టు వాతావరణానికి అలవాటు పడటంలో కూడా ఒక విలువ ఉంటుంది. అతన్ని జట్టుకు సేవ చేయనివ్వండి, సీనియర్లకు సహాయం చేయనివ్వండి, అవసరమైతే నీళ్లు కూడా తీసుకురానివ్వండి. ఆ అనుభవం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది” అని పేర్కొన్నాడు. ఒక గొప్ప ఆటగాడు రాత్రికి రాత్రే అయిపోరని, సచిన్ టెండూల్కర్ లాగే వైభవ్ సైతం ఒక్కసారి ఆడటం ప్రారంభిస్తే మళ్లీ జట్టు నుంచి తప్పుకునే పరిస్థితి రాకపోవచ్చని చెప్పాడు. కానీ.. ఇప్పుడు బెంచ్‌పై కూర్చుంటే జట్టు వాతావరణంపై మంచి అవగాహన వస్తుందని విశ్లేషించాడు.

అయితే, ఫామ్‌లో ఉన్న ఓ అసాధారణ ప్రతిభావంతుడిని జట్టుతో పాటు తిప్పుతూ డ్రింక్స్ మోయించడం ఏంటని సోషల్ మీడియాలో అశ్విన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించిన అశ్విన్.. సీనియర్లకు నీళ్లు అందించడం తక్కువ తనం ఎలా అవుతుందని ప్రశ్నించాడు. “వైభవ్ సూర్యవంశీకి మనం సమయం ఇవ్వాలి. అతను అంత ప్రత్యేకమైన ఆటగాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎప్పుడో ఒకప్పుడు ఆడాల్సిందే. కానీ నేను చెప్పేది ఏంటంటే.. వాటర్ మోయడం అనేది దిగజారుడు తనం కాదు. అసలు నీళ్లు అందించడాన్ని జనాలు ఎందుకు తప్పుగా చూస్తున్నారు? 1900లు, 2000ల కాలంలో నేను చెన్నైలో బాల్‌బాయ్‌గా ఉన్నాను, అప్పట్లో క్రికెటర్లకు నీళ్లు అందించడానికి నేను ఎంతో సంతోషపడేవాణ్ణి. గ్రౌండ్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లి భారత ఆటగాళ్లకు వాటర్ బాటిల్ ఇవ్వడం ఎప్పటి నుంచి తక్కువ పనిగా మారిపోయింది?” అంటూ అశ్విన్ ఘాటుగా బదులిచ్చాడు.