Site icon NTV Telugu

Nadendla Manohar: రేపటి నుంచి రేషన్ షాపుల రీ ఓపెన్.. మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం..

Nadendla Manohar

Nadendla Manohar

చౌక ధరల దుకాణాలు మళ్ళీ తెరుచుకుంటున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుంచి 29,760 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకులు అందించబోతున్నామని స్పష్టం చేశారు. ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ ఫాం ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తామని పేర్కొన్నారు. “మీకు వీలైన సమయంలో వెళ్ళి తెచ్చుకోవచ్చు.. రేపటి నుంచి 1 కోటి 46 లక్షల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందేలా చూస్తాం. ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేశాం. కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వం.” అని నాదెండ్ల మనోహర్ పోస్టులో రాసుకొచ్చారు.

READ MORE: Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం దేశ ప్రజల్నితప్పుదారి పట్టించింది.. సీడీఎస్ ప్రకటనపై ఖర్గే..

కాగా.. ప్రతీ పేద కుటుంబానికి రేషన్‌ దుకాణాల ద్వారా నిత్యావసర సరకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ‘‘పేదలకు రేషన్‌ సరకులు అందించే చౌకధరల దుకాణాలను గత ప్రభుత్వం మూసివేసింది. ఇంటింటికీ అందిస్తామని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారు. ఇంటింటికీ ఇవ్వడం మానేసి నెలలో ఒకటి రెండ్రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలు సరకులు అందక ఇబ్బందులు పడ్డారు. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకు సెలవులు పెట్టుకోవాల్సి వచ్చేది. మిగిలిన రేషన్‌ బియ్యం, సరకులను అక్రమంగా తరలిస్తున్న విషయం సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖ పోర్టుల్లో పట్టుకుంది. వీటిని అరికట్టేందుకు చౌకధరల దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్‌ సరకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది’’ అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

Exit mobile version