Ranveer Singh: ‘ధురంధర్’ సక్సెస్ తర్వాత రణ్‌వీర్‌కు బిగ్ షాక్.. బాలీవుడ్‌ స్టార్ హీరోను “బ్యాన్” చేయడం సాధ్యమేనా?

Dhurandhar 2, Ranveer Singh, Aditya Dhar, Dhurandhar The Revenge, Dhurandhar 2 Box Office Collection

Dhurandhar 2, Ranveer Singh, Aditya Dhar, Dhurandhar The Revenge, Dhurandhar 2 Box Office Collection

Ranveer Singh–Don 3 controversy: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌పై ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయ్స్’ (FWICE) విధించిన ‘సహాయ నిరాకరణ’ (non-cooperation) ఆదేశాలు ప్రస్తుతం పరిశ్రమలో అత్యంత పెద్ద చర్చకు దారితీశాయి. బాలీవుడ్ పరిశ్రమలో ఒక స్టార్ హీరోను నిజంగా బ్యాన్ చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి.. ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీలకు చెందిన ‘ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్’ ప్రతిష్టాత్మకంగా నిర్మించాలనుకున్న ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో FWICE సోమవారం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. వివాదం పరిష్కారమయ్యే వరకు రణ్‌వీర్‌కు ఎవరూ సహకరించవద్దని పిలుపునివ్వడంతో పాటు, ప్రీ-ప్రొడక్షన్ దశలో నిర్మాతలకు జరిగిన రూ. 45 కోట్ల నష్టాన్ని రణ్‌వీర్ భరించాలనే డిమాండ్‌కు FWICE మద్దతు తెలిపింది.

ప్రస్తుతం ఈ వివాదం బాలీవుడ్‌లో ఓ పెద్ద చర్చను లేవనెత్తింది. ఒక సినిమా సంఘం విధించే “బ్యాన్” లేదా నిషేధం వల్ల నిజంగా ఒక నటుడికి అవకాశాలు తగ్గిపోతాయా? లేక చర్చల కోసం ఒత్తిడి తెచ్చే వ్యూహం మాత్రమేనా? అనే ప్రశ్నలకు పరిశ్రమ నిపుణుడు, చలనచిత్ర నిర్మాత గిరీష్ జోహార్ స్పందించారు. హెడ్‌లైన్స్‌లో చూసేదానికంటే వాస్తవం చాలా భిన్నంగా ఉంటుందన్నారు. ఇలాంటి ఆదేశాలు ఇండస్ట్రీలో కొంత హడావుడి సృష్టించి, పనులను కాస్త నెమ్మదింపజేస్తాయే తప్ప, ఒక నటుడిని రాత్రికి రాత్రే పరిశ్రమకు దూరం చేయలేవని చెప్పారు. ఒక సంఘం నిషేధం విధించినప్పుడు ఇతర నిర్మాతలు సైతం దానిని గమనిస్తారని, దీనివల్ల కొన్ని ప్రాజెక్ట్‌లు తాత్కాలికంగా ఆగడం వంటివి జరుగుతాయని వివరించారు. అయితే బాలీవుడ్ అనేది ఒకే ఒక్క కేంద్ర అధికారం కింద నడవదని గుర్తుచేశారు. పరిశ్రమలో అనేక సంఘాలు ఉన్నాయని, FWICE అనేది గౌరవప్రదమైన, ముఖ్యమైన సంస్థ అయినప్పటికీ, రణ్‌వీర్ బ్యాన్ అంశం తుది నిర్ణయం అనేది ఆయా నిర్మాతలు, బ్యానర్ల ఇష్టాన్ని బట్టి ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు.. రణ్‌వీర్ సింగ్ ప్రస్తుత షూటింగ్ షెడ్యూల్స్ చూస్తే తక్షణమే వచ్చే నష్టమేమీ లేదని జోహార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ‘ధురంధర్’ సిరీస్ విజయం తర్వాత రణ్‌వీర్ ప్రస్తుతం చిన్న బ్రేక్‌లో ఉన్నారని, మరో రెండు నెలల్లో కొత్త సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందన్నారు. ఈ గ్యాప్ లోనే ఇరువర్గాలు కూర్చొని మాట్లాడుకోవడానికి తగినంత సమయం దొరుకుతుందని, రణ్‌వీర్ తదుపరి సినిమా సెట్స్‌పైకి వెళ్లే సమయానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం నిర్మాతల వైపు ఉన్న ఆర్థిక నష్టాల గురించే కాకుండా, నటుడి వర్షన్ సైతం వినడం ముఖ్యం అని జోహార్ అన్నారు. రణ్‌వీర్ సింగ్ అంతటి పెద్ద ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారంటే ఆయనకు సైతం బలమైన కారణాలు ఉండే ఉంటాయని, ఒకవైపు మాటలనే విని జడ్జ్ చేయలేమని పేర్కొన్నారు. అందుకే కాబోలు, ఈ విషయాన్ని చర్చించడానికి FWICE సరైన వేదిక కాదని రణ్‌వీర్ టీమ్ భావిస్తోంది. నిర్మాతలు లీగల్ నోటీసుల భాష మాట్లాడుతున్నారు కాబట్టి, రణ్‌వీర్ సైతం తన లీగల్ టీమ్ ద్వారానే కోర్టు పరిధిలోనే సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని జోహార్ విశ్లేషించారు. కాంట్రాక్టులు, లీగల్ పేపర్లు ఎన్ని ఉన్నా.. బాలీవుడ్ ఇప్పటికీ వ్యక్తిగత సంబంధాలు, పరస్పర చర్చలపైనే ఎక్కువగా ఆధారపడి నడుస్తుందని, ఇక్కడ ఎవరికీ శిక్షలు వేయడం ముఖ్యం కాదు, సెటిల్మెంట్ ముఖ్యం అని అన్నారు. పైగా సినిమా ఇండస్ట్రీలో ఎవరూ శాశ్వత శత్రువులు కారని, కాలక్రమేణా పాత కోపాలను మర్చిపోయి అందరూ కలిసిపోతారని, భవిష్యత్తులో రణ్‌వీర్ మళ్లీ ‘డాన్ 3’ లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని జోహార్ తెలిపారు.

అసలు ఏం జరిగింది? ఇంతకీ ఈ వివాదం ఏంటి?
FWICE తెలిపిన వివరాల ప్రకారం… ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఏడాది ప్రారంభంలో తమను ఆశ్రయించింది. రణ్‌వీర్ సింగ్ తమ బ్యానర్‌తో మూడు సినిమాల ఒప్పందంపై సంతకం చేశారని, అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఫిర్యాదులో పేర్కొంది. నటులు చివరి నిమిషంలో ఇలా తప్పుకోవడం వల్ల పరిశ్రమలోని పర్యావరణ వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా సినిమాతో ముడిపడి ఉన్న అనేక విభాగాల కార్మికులు ఆర్థికంగా నష్టపోతారని ఫెడరేషన్ తీవ్రంగా తప్పుపట్టింది. FWICE చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్ ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నారు. షూటింగ్‌కు ముందు నటులు ఇలా చేయడం ప్రమాదకరమైన ట్రెండ్‌కు దారితీస్తుందని హెచ్చరించారు. అయినప్పటికీ, చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫెడరేషన్ ప్రకటించింది.

మరోవైపు రణ్‌వీర్ సింగ్ తన ప్రతినిధి ద్వారా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. అయితే ఈ ఆరోపణలపై నేరుగా స్పందించకుండా చాలా హుందాగా వ్యవహరించారు. రణ్‌వీర్ సింగ్‌కు చిత్ర పరిశ్రమ అన్నా, అలాగే ‘డాన్’ ఫ్రాంచైజీతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరన్నా అత్యంత గౌరవం ఉందని రణ్‌వీర్ ప్రతినిధి తెలిపారు. వృత్తిపరమైన చర్చలు, వ్యక్తిగత బంధాలను గౌరవప్రదంగా, పరిణతితో పరిష్కరించుకోవాలని రణ్‌వీర్ నమ్ముతున్నారని, అందుకే ఈ వివాదంపై కావాలనే మౌనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బయట వస్తున్న ఊహాగానాలకు, కథనాలకు స్పందించాల్సిన అవసరం ఆయనకు లేదని, ప్రస్తుతం దృష్టి అంతా తన వృత్తి, తదుపరి ప్రాజెక్టులపైనే ఉందని స్పష్టం చేస్తూ ‘డాన్’ ఫ్రాంచైజీకి ఆల్‌ది బెస్ట్ చెప్పారు.

డైరెక్టర్ ఫర్హాన్, రణ్‌వీర్ మధ్య ఎక్కడ చెడింది?
2023లో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజాలు పోషించిన ఐకానిక్ ‘డాన్’ పాత్రలోకి రణ్‌వీర్ సింగ్ వస్తున్నట్లు ప్రకటించినప్పుడు ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అప్పట్లో విడుదలైన స్టైలిష్ అనౌన్స్‌మెంట్ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది. మొదట్లో రణ్‌వీర్ బాక్సాఫీస్ పరాజయాల వల్లే ఈ సినిమా లేట్ అవుతుందని ప్రచారం జరిగినా.. ‘ధురంధర్’ విజయంతో ఆ రూమర్లకు చెక్ పడింది. అసలు సమస్య రణ్‌వీర్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య వచ్చిన సృజనాత్మక విబేధాలే (creative differences) అని తెలుస్తోంది. సినిమా పదే పదే ఆలస్యం కావడం, పక్కా స్క్రిప్ట్ లాక్ చేయకపోవడంపై రణ్‌వీర్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ‘డాన్’ పాత్రను మరింత డార్క్ గా, అగ్రెసివ్ యాక్షన్ సీన్లతో కాస్త గ్రిప్పింగ్‌గా చూపించాలని రణ్‌వీర్ కోరగా.. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మాత్రం పాత సినిమాల శైలిలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారట. ఈ లోగా రణ్‌వీర్ ప్రాజెక్ట్‌లో ఉండగానే, మేకర్స్ వేరే నటుల ఆప్షన్లను సైతం పరిశీలిస్తున్నారని తెలియడంతో రణ్‌వీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. చిన్న వృత్తిపరమైన విబేధంగా మొదలైన ఈ గొడవ, నిర్మాతలు కోర్టును ఆశ్రయించి రూ. 40 నుంచి 45 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేయడంతో పెద్ద వివాదంగా మారింది. మొదట ఈ వివాదం ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ వద్దకు వెళ్లగా, ఇప్పుడు FWICE చేతుల్లోకి వచ్చింది. ఏదేమైనా, ఎన్నో ఏళ్ల నిరీక్షణ, నటీనటుల మార్పుల తర్వాత ‘డాన్ 3’ ప్రస్తుతానికి పూర్తిగా నిలిచిపోయింది. అయితే ఈ వివాదం బాలీవుడ్‌లోని ఒక కొత్త నిజానికి అద్దం పడుతోంది… ఇక్కడ బయట వినిపించే నిషేధాలు హెడ్‌లైన్స్‌కే పరిమితం అవుతాయని.. కానీ అసలు కథ మాత్రం మూసి ఉన్న తలుపుల వెనుక జరిగే చర్చల్లోనే తేలుతుందని ప్రముఖులు చెబుతున్నారు.