Hacking : ఢిల్లీ ప్రతిష్టాత్మక సంస్థ ఎయిమ్స్ సర్వర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. హ్యాకర్లు రూ.200 కోట్లు డబ్బులను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎయిమ్స్ ప్రధాన సర్వర్ 23 బుధవారం నాడు హ్యాక్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ సర్వర్‌లో దాదాపు 3-4 కోట్ల మంది రోగుల డాటా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ డౌన్ కావడంతో ఎమర్జెన్సీ ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, లేబొరేటరీ విభాగాల్లో పేషెంట్ కేర్ సేవలు మాన్యువల్‌గా నిర్వహిస్తున్నారు. కంప్యూటర్లలో రాన్సమ్ వేర్ ను చొప్పించి, ఆ కంప్యూటర్లను పనిచేయకుండా చేశారు. వరుసగా ఆరో రోజు కూడా ఎయిమ్స్ లోని సర్వర్లు తెరుచుకోలేదు. తమకు రూ.200 కోట్ల క్రిప్టోకరెన్సీ చెల్లిస్తేనే సర్వర్లను తిరిగి పనిచేసేలా చేస్తామని హ్యాకర్లు స్పష్టం చేశారు.
Read Also: Indian Olympic Association : భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా పీటీ ఉష
ఈ హ్యాకింగ్‌పై ఇండియా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసులు, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై దోపిడీ, సైబర్ టెర్రరిజం కేసును ఢిల్లీ ఇంటెలిజెన్స్ అధికారులు కేసు నమోదు చేశారు. ఆరు రోజులుగా సర్వర్ హ్యాకర్ల చేతుల్లోనే ఉంది. దాంతో దవాఖానలో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆస్పత్రిలోని ఓపీడీ, ఐపీడీలకు వచ్చే రోగులు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ బుకింగ్, టెలికన్సల్టేషన్ వంటి డిజిటల్ సేవలు కూడా సర్వర్ అంతరాయంతో ప్రభావితమయ్యాయి. అయితే, ఈ సేవలన్నీ మాన్యువల్‌గా అమలు చేస్తూ రోగులకు ఇబ్బంది రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎయిమ్స్ సర్వర్‌లో మాజీ ప్రధానులు, మంత్రులు, బ్యూరోక్రాట్‌లు, న్యాయమూర్తులతోపాటు పలువురు వీవీఐపీల డాటాను భద్రపరిచారు. నెట్‌వర్క్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఐదు రోజుల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
