NTV Telugu Site icon

UPI Payments: దేశంలో నిలిచిపోయిన యూపీఐ సేవలు.. కారణం ఏంటంటే?

Upi Transaction

Upi Transaction

Software issue has affected UPI Transactions: గత రెండు రోజులుగా దేశంలోని కొన్ని బ్యాంకులకు చెందిన యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) సేవలు సరిగా పనిచేయడం లేదు. చెల్లింపుల సంగతి అటుంచితే.. కనీసం బ్యాంకు బ్యాలెన్స్ కూడా చూపించలేదు. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడడంతో యూజర్లు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. యూపీఐ సేవలు పనిచేయకపోవడానికి అసలు కారణం ఏంటంటే.. టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడి జరిగింది.

భారతదేశంలోని పలు బ్యాంకులకు టెక్నికల్ సపోర్టును ‘సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌’ అందిస్తోంది. ఈ టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌పై ‘ర్యాన్సమ్‌వేర్‌’ దాడి జరిగింది. దీంతో భారత్‌లోని దాదాపు 300 బ్యాంకుల చెల్లింపు వ్యవస్థలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. వార్తా ఏజెన్సీ సంస్థ రాయిటర్స్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి అటు సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ గానీ, ఇటు ఆర్‌బీఐ గానీ స్పందించలేదు.

Also Read: Nothing Phone 2a Plus Launch: ‘నథింగ్‌’ నుంచి కొత్త ఫోన్‌.. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 50 ఎంపీ సెల్ఫీ కెమెరా!

ర్యాన్సమ్‌వేర్‌ దాడి ఘటన తమ దృష్టికి వచ్చినట్లు చెల్లింపు వ్యవస్థలను పర్యవేక్షించే నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్సీపీఐ) పేర్కొంది. కోపరేటివ్‌, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు టెక్నాలజీ సేవలు అందించే సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌పై ర్యాన్సమ్‌వేర్‌ దాడితో కొన్ని చెల్లింపు వ్యవస్థలపై ప్రభావం పడినట్లు పబ్లిక్‌ అడ్వైజరీ విడుదల చేసింది. మిగతా చెల్లింపుల వ్యవస్థలపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు రిటైల్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌తో సీ-ఎడ్జ్‌ టెక్నాలజీస్‌ను తాత్కాలికంగా వేరుచేసినట్లు పేర్కొంది. ఈ సంస్థ సేవలు అందిస్తున్న సదరు బ్యాంకుల ఖాతాదారులు ఈ ఐసోలేషన్‌ సమయంలో సేవలు పొందలేరని చెప్పింది. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అవసరమైన సెక్యూరిటీ రివ్యూ జరుపుతున్నట్లు తెలిపింది. బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా పనిచేస్తాయని చెప్పుకొచ్చింది.

Show comments