UP Election Commission: ‘రామ్‌నే యాదవ్‌ కో మారా’.. ఓటర్ల జాబితాలో వింత పేరు.. యూపీ సీఈవో క్షమాపణలు

Up Ceo Apology

Up Ceo Apology

UP Election Commission: ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల ఓటర్ల జాబితాలో ‘రామ్‌ నే యాదవ్‌ కో మారా’ (రాముడు యాదవ్‌ను కొట్టాడు) అని వింతగా ఉన్న ఒక పేరు తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీ సంజయ్‌ సింగ్‌ దీనిపై స్పందిస్తూ, ఎన్నికల కమిషన్‌ నిష్పాక్షికతతో పాటు వారి సాఫ్ట్‌వేర్‌ పనితీరుపై తీవ్ర స్థాయిలో ప్రశ్నలు గుప్పించారు. అయితే, ఈ అంశంపై ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా నుంచి వచ్చిన ఘాటైన సమాధానం వివాదాన్ని మరింత రాజేసింది. ప్రభుత్వ సంస్థకు తగని రీతిలో ఆ వ్యాఖ్యలు ఉండటంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో సీఈవో యూపీ తాజాగా తన తప్పును అంగీకరిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇకపై సామాజిక మాధ్యమాల్లో సంభాషణలు ఎల్లప్పుడూ సభ్యాతిసభ్యలతో, అధికారికంగానే ఉంటాయని హామీ ఇచ్చారు.

అసలు ఏంటి ఈ వివాదం..?
అసలు ఈ రగడ అంతా బలియా శాసన మండలి నియోజకవర్గ ఓటర్ల జాబితాతో మొదలైంది. రామ్‌హిత్‌యాదవ్‌ అనే ఓటరు పేరును ఈసీ సాఫ్ట్‌వేర్‌ చిత్రవిచిత్రంగా అనువాదం చేసింది. రామ్‌హిత్‌యాదవ్‌ అనే పేరును రామ్‌ హిట్‌ యాదవ్‌ అని ఇంగ్లిషులో అర్థం చేసుకున్న సాఫ్ట్‌వేర్.. ‘రామ్‌నే యాదవ్‌ కో మారా’ అంటూ హిందీలో పేర్కొంది. ఆ జాబితాలో ఈ వివాదాస్పద పేరును చూసిన ఆప్ నేత రాజేష్ యాదవ్, ఎంపీ సంజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కంప్యూటర్ పొరపాటున కూడా యాదవ్ అనే పేరునే ఎందుకు టార్గెట్ చేసిందంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌తో పాటు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. సీఈవో ఉత్తర ప్రదేశ్ అధికారిక ఖాతా వ్యంగ్య ధోరణిలో స్పందిస్తూ, కంప్యూటర్‌కు ఎలాంటి కుల పిచ్చి ఉండదని, అదృష్టవశాత్తూ ఈ పొరపాటులో కులం కానీ లేదా ఏ మైనారిటీ పట్ల కానీ వివక్ష జరగలేదంటూ సమాధానమిచ్చింది. ఒక రాజ్యాంగబద్ధమైన అధికారిక ఖాతా నుంచి వచ్చిన ఈ భాష ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది.

ప్రజల నుంచి, రాజకీయ వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో సీఈవో ఉత్తర ప్రదేశ్ దిగిరాక తప్పలేదు. తాజాగా మరో పోస్ట్ పెడుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ అధికారిక ఖాతా నుంచి వచ్చిన సమాధానాల్లో ఉపయోగించిన భాష, భావం, పదునైన శైలి ఒక ప్రభుత్వ సంస్థ గౌరవానికి, స్థాయికి తగినట్లుగా లేవని అంగీకరించారు. ఈ వ్యాఖ్యల వల్ల మనస్తాపానికి, ఆగ్రహానికి గురైన వారందరికీ హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జరిగే ప్రతి సంభాషణ పూర్తిగా మర్యాదపూర్వకంగా, నియమబద్ధంగా, అధికారిక శైలిలోనే ఉండేలా చూసుకుంటామని ఎన్నికల కమిషన్ హామీ ఇచ్చింది.