Rajinikanth – Nayanthara: వరుస బ్లాక్బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే ‘ధర్మన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ చిత్ర కాస్టింగ్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ వర్గాల్లో తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కథను కీలక మలుపు తిప్పే ఒక ప్రత్యేక పాత్ర కోసం చిత్ర బృందం నయన్‌ను సంప్రదించినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘చంద్రముఖి’, ‘కుచేలన్’ (కథానాయకుడు), ‘దర్బార్’, ‘అన్నాత్తే’ (పెద్దన్న) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ హిట్ జోడీ మళ్లీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోందనే వార్త అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని నింపుతోంది.
దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ చిత్రాన్ని భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ నటి సిమ్రన్, హీరోయిన్ రాశీ ఖన్నా నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా, టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేనితో పాటు సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ భారీ కాస్టింగ్ లిస్ట్‌లోకి నయనతార పేరు కూడా చేరడంతో ‘ధర్మన్’ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

