NTV Telugu Site icon

Rajat Patidar RCB: మూడేళ్ల ముందు అమ్ముడే పోలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్!

Rajat Patidar Rcb

Rajat Patidar Rcb

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో అత్యంత ఆకర్షణీయ జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు కెప్టెన్‌గా రజత్ పటీదార్‌ ఎంపికైన విషయం తెలిసిందే. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు నడిపించిన ఆర్సీబీకి.. పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని రజత్ సారథిగా నియమితుడు కావడం అందిరినీ ఆశ్చర్యం కలిగించే విషయమే. అంతేకాదు మూడేళ్ల ముందు ఐపీఎల్‌లో అమ్ముడే కాని ఈ 31 ఏళ్ల ఆటగాడు.. ఆర్సీబీకి సారథి కావడం విశేషమే. అయితే ఈ అనూహ్య ఎదుగుదలకు కారణం రజత్ ఆటలో వచ్చిన అనూహ్య మార్పే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

2021లో రజత్ పటీదార్‌కు ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. రూ.20 లక్షలకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. 2021లో 4 మ్యాచ్‌లలో 71 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తర్వాతి సీజన్‌కు అతడిని అట్టిపెట్టుకోలేదు. 2022 వేలంలో రజత్‌ను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. 2022 సీజన్ ముందు లవ్‌నీత్ సిసోడియా గాయపడడంతో.. అతడి స్థానంలో రూ.20 లక్షలకే రజత్‌ను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. ఆ సీజన్లో మెరుపులు మెరిపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై 54 బంతుల్లోనే 112 పరుగులు బాదాడు. గాయం వల్ల 2023 సీజన్‌కు అతడు దూరమయ్యాడు.

2024 పునరాగమనం చేసిన రజత్ పటీదార్‌ 15 మ్యాచ్‌ల్లో 30.38 సగటు, 177.13 స్ట్రైక్ రేట్తో 395 పరుగులు చేశాడు. విధ్వంసక బ్యాటింగ్ కారణంగా అతడిని 2025 సీజన్‌ కోసం రూ.11 కోట్లకు ఆర్సీబీ అట్టిపెట్టుకుంది. 2024లో జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను ఈసారి కొనుగోలుచేయలేదు. స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టులో ఉన్నప్పటికీ.. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాలు పోటీలో ఉన్నా.. కెప్టెన్సీ పటీదార్‌కు దక్కింది. మూడేళ్ల ముందు ఐపీఎల్‌లో అమ్ముడే కాని ఆటగాడు.. ఇప్పుడు రూ.11 కోట్లకు అట్టిపెట్టుకోవడం, కెప్టెన్‌గా మారడం విశేషం. ఇప్పటిదాకా 27 ఐపీఎల్ మ్యాచ్‌లలో 34.74 సగటుతో 799 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి.