NTV Telugu Site icon

Rajasthan Royals: ఒక్కో సిక్సర్‌.. ఆరు ఇళ్లకు సౌర విద్యుత్‌! రాజస్థాన్ రాయల్స్ సూపర్

Rajasthan Pink Promise

Rajasthan Pink Promise

Why RR Wearing Pink Jersey in IPL 2024 Match vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2024లో భాగంగా శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాళ్లు పూర్తిగా గులాబీ రంగు జెర్సీలతో బరిలోకి దిగారు. ఆర్ఆర్ ప్లేయర్స్ పూర్తిగా గులాబీ రంగు జెర్సీలతో ఆడడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. రాజస్థాన్‌ మహిళల సాధికారత కోసం ఆ ఫ్రాంఛైజీ కృషి చేస్తోంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్న మహిళలకు రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రాంచైజీ మద్దతుగా నిలుస్తోంది.

‘పింక్‌ ప్రామిస్‌’ పేరుతో రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రాంచైజీ వేర్వేరు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నీరు, సోలార్‌ విద్యుత్‌ అందించడంతో పాటు మహిళల మానసిక ఆరోగ్యం విషయంలో అండగా నిలుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో నమోదైన ఒక్కో సిక్సర్‌కు.. ఆరు ఇళ్లకు సౌర విద్యుత్‌ అందిస్తామని రాజస్థాన్‌ ప్రాంచైజీ ప్రకటించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 సిక్సర్‌లు నమోదయ్యాయి. అంటే.. 78 ఇళ్లకు సౌర విద్యుత్‌ అందించనుంది. అలాగే ప్లేయర్స్ ధరించిన గులాబీ జెర్సీల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బు, మ్యాచ్‌కు అమ్ముడైన ఒక్కో టికెట్‌ నుంచి రూ.100 చొప్పున విరాళంగా ఇవ్వనుంది.

Also Read: Virat Kohli-IPL: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లీ!

ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి చాలా ముందు మార్చి 12న శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర, రాజస్థాన్ క్రీడా మంత్రి కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌లు ‘పింక్‌ ప్రామిస్‌’ కార్యక్రమంను ప్రారంభించారు. రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రాంచైజీ చేస్తోన్న ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఐపీఎల్ 2024లో భాగంగా ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రాజస్తాన్‌ గెలిచింది. ప్రస్తుతం 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది.