Congress released its manifesto for the Rajasthan assembly elections 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం ఆసన్నమైంది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరగనుండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను మంగళవారం ఉదయం విడుదల చేసింది. జైపుర్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ పార్టీ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా, సీఎం అశోక్ గహ్లోత్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సీపీ జోషి, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక హామీలను మేనిఫెస్టో ద్వారా ప్రకటించింది . వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో కుల గణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. పంచాయతీ స్థాయిలో నియామకాల కోసం కొత్త వ్యవస్థను తీసుకొస్తామని వాగ్దానం చేసింది. రైతులకు రూ. 2లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది. ఇక స్వామినాథన్ కమిషన్ ప్రకారం.. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించింది.
Also Read: Plane Crash: సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం.. వీడియో వైరల్!
ఉజ్వల లబ్ధిదారులకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న కాంగ్రెస్.. మహిళలకు ఏడాదికి రూ. 10వేల నగదు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. ప్రభుత్వ కాలేజీలో చేరే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు.. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానంపై చట్టం.. చిరంజీవి మెడికల్ ఇన్స్యూరెన్స్ పథకం రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు పెంపు.. ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 15 లక్షల వరకు బీమా పథకం లాంటి హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. రాజస్థాన్‌లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 23 వరకు ప్రచారానికి గడువు ఉంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాహ్నంగా కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడుతున్నాయి.