NTV Telugu Site icon

Rajastan Congress Crisis: రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం.. 92 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajastan Congress

Rajastan Congress

Rajastan Congress Crisis: రాజస్థాన్‌ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. రాజస్థాన్‌ సీఎం మార్పు రాజకీయం తీవ్ర సంక్షోభానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ముంగిట ఆ పార్టీకి కొత్త సమస్య ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న అశోక్‌ గహ్లోత్‌ను ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాలని చెప్పడం ఈ సమస్యకు కారణమైంది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేస్తూ మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఈ మేరకు తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషికి సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్‌ గెహ్లాట్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీచేస్తున్నారు.

రాజస్థాన్‌కు తదుపరి ముఖ్యమంత్రి తానే కావాలని మరో కీలక నేత సచిన్‌ పైలట్‌ భావిస్తుండగా.. అధిష్ఠానం కూడా ఆయన వైపే మొగ్గు చూపుతోంది. దీంతో పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని చేయడానికి వీల్లేదంటూ గహ్లోత్‌ వర్గం శాసనసభ్యులు తేల్చిచెప్పారు. ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని నిర్ణయించగా.. అంతకుముందే గహ్లోత్‌ వర్గానికి చెందిన 92 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అధిష్ఠానం సీఎల్పీ భేటీని కూడా రద్దు చేసి.. గహ్లోత్‌, పైలట్‌ సహా సీఎల్పీ భేటీకి పరిశీలకులుగా వెళ్లినవారిని వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. వాస్తవానికి ఏఐసీసీ అధ్యక్ష పదవితోపాటు రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవిలోనూ తానే కొనసాగాలని గహ్లోత్‌ తొలుత భావించారు.

అయితే ఒకరికి ఒకే పదవి అని రాహుల్‌గాంధీ స్పష్టం చేయడంతో.. తనకు విశ్వాసపాత్రుడైన నేతను ముఖ్యమంత్రిని చేయాలని అశోక్‌ గహ్లోత్‌ నిర్ణయించుకున్నారు. కానీ, ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సచిన్‌ పైలట్‌ పట్ల అధిష్ఠానం మొగ్గు చూపుతుండడంతో దీనిని అడ్డుకునేందుకు గహ్లోత్‌ మొదటనుంచీ ప్రయత్నిస్తున్నారు. తన వర్గానికే చెందిన ప్రస్తుత శాసనసభ స్పీకర్‌ సీపీ జోషిని ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతో గహ్లోత్‌ ఉన్నారు. ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ నిర్వహించి తదుపరి సీఎంను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. తదుపరి సీఎంగా పార్టీ అధిష్టానం సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ను దాదాపు ఎంపిక చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్‌ వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం మంత్రి శాంతి ధరివాల్‌ నివాసంలో భేటీ అయ్యారు. సీఎంగా పైలట్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో స్పీకర్‌ నివాసానికి చేరుకొని రాజీనామాలు అందించారు.

CUET UG 2022 : అడ్మిషన్ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు రుసుమును మినహాయించాలి… విద్యార్థులు డిమాండ్‌

తదుపరి ముఖ్యమంత్రిగా సచిన్‌ పైలట్‌ అభ్యర్థిత్వాన్ని గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2020లో తిరుగుబాటు చేసి సర్కారు కూల్చాలని చూసిన వ్యక్తిని ఎలా ముఖ్యమంత్రి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సీఎల్పీ భేటీకి అధిష్ఠానం పరిశీలకులుగా మల్లికార్జున ఖర్గే, అజయ్‌ మాకెన్‌లను పంపించింది. వీరు గహ్లోత్‌తో కలిసి సీఎం అధికారిక నివాసానికి చేరుకోగా అక్కడ కేవలం 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. గహ్లోత్‌ మద్దతుదారులైన మిగిలిన ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో మంత్రి శాంతి ధరివాల్‌ నివాసంలో సమావేశమయ్యారు. పైలట్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ సీఎంగా అంగీకరించబోమంటూ తేల్చి చెప్పారు. 2020లో గెహ్లోత్‌ సర్కారుపై పైలట్‌ తిరుగుబాటును గుర్తు చేస్తూ.. ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసిన వారికి సీఎం పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఆనాడు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల్లోనే ఒకరికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

రాజస్థాన్‌లో సంక్షోభ పరిష్కారానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం రంగంలోకి దిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా పైలట్‌ ఎంపికపై గెహ్లాట్‌ అసంతృప్తిని వెల్లగక్కినట్టు తెలుస్తోంది. ‘నా చేతుల్లో ఏం లేదు. ఎమ్మెల్యేలు అందరూ ఆగ్రహంగా ఉన్నారు’ అని వేణుగోపాల్‌కు తెలిపినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాను తన జీవితంలో ఎన్నో పదవులు చేపట్టినట్లు.. కావున కొత్త తరం రావాలని కోరుకుంటున్నట్లు గెహ్లాట్ తెలిపారు.

Show comments