Rajahmundry Theft Case Solved: రాజమహేంద్రవరంలో పగటిపూట జరిగిన భారీ ఇంటి దొంగతనం కేసును ప్రకాష్ నగర్ పోలీసులు ఛేదించారు. ఇంటి యజమానులు లేని సమయంలో నారాయణపురంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 7వ తేదీన నారాయణపురంలో నివాసం ఉంటున్న పోలవరపు వెంకట ధర్మరాజు ఇంట్లో పగటిపూట దొంగతనం జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్, సెంట్రల్ జోన్ ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా ఆదేశాలతో ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎస్.కె. బాజీలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ నెల 11వ తేదీ సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ శ్యామ్ రిచర్డ్స్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి 410 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక జత వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.53.51 లక్షలుగా పోలీసులు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు చెందిన నిందితుడు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై మొత్తం 65 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు.
వంశీకృష్ణపై హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి, బేగంపేట, నార్సింగి, సరూర్‌నగర్‌తో పాటు ఖమ్మం, విజయవాడ, నరసరావుపేట, చీరాల తదితర ప్రాంతాల్లో దొంగతనాల కేసులు ఉన్నట్లు వెల్లడించారు. పలుమార్లు జైలుకు వెళ్లిన నిందితుడిపై ఎల్‌బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన ప్రకాష్ నగర్ ఇన్‌స్పెక్టర్ బాజీలాల్, ఎస్‌ఐలు జి. సతీష్, కె. నవీన్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, క్రైమ్ పార్టీ సిబ్బంది ప్రదీప్ కుమార్, ఎస్. వీరబాబులను ఏఎస్పీ డాక్టర్ తరుణ్ పహ్వా అభినందించి రివార్డులు ప్రకటించారు. ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు పోలీసుల లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (LHMS) సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగినా వెంటనే 112 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

