బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ప్రజల్లో అపోహలను తొలగించేందుకు రాజమండ్రిలో చికెన్ మేళాకు అనుహ్య స్పందన లభించింది. చికెన్ వంటకాలను తినడానికి నాన్ వెజ్ ప్రియులు క్యూ కట్టారు. మేళాలో వివిధ రకాల చికెన్ వంటకాలను ఏర్పాటు చేశారు. చికెన్ వంటకాలను ఆరగించడానికి నాన్ వెజ్ ప్రియులు ఎగబడ్డారు. చికెన్ హోల్ సేల్ అండ్ రిటైల్ వర్తక సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి ఆజాద్ చౌక్ సెంటర్లో ఈ చికెన్ మేళాను ఏర్పాటు చేశారు.
చికెన్ 100 డిగ్రీల వేడిలో ఉడికించి తినడం వల్ల బర్డ్ ఫ్లూ మనిషికి వచ్చే అవకాశం లేదని తెలియజెప్పడానికి ఈ మేళా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, గుడ్డు అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిందని నిర్వాహకులు ఆవేదన చెందారు. పౌల్ట్రీ రంగానికి అపార నష్టం వాటిల్లిందని అన్నారు. చికెన్ మేళాకు అనూహ్యస్పందన రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు.
బర్డ్ ఫ్లూ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చాలామంది చికెన్ చినడం మానేశారు. అయితే ప్రజలు ప్రస్తుతం కోడి మాంసం, గుడ్లు ఎలాంటి సందేహం లేకుండా తినొచ్చని అధికారులు చెబుతున్నారు. వైరస్ 75 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద చనిపోతోందని.. ఇంట్లో గుడ్లు, మాంసాన్ని 100 సెంటిగ్రేడ్ వరకు ఉడికిస్తాం కాబట్టి తినటంతో ఎలాంటి సందేహం లేదని అధికారులు వివరిస్తున్నారు.