Site icon NTV Telugu

Rajagopal Reddy: పదవులు, పైసలూ మీకేనా.. సీఎంను ప్రశ్నించిన మునుగోడు ఎమ్మెల్యే!

Munugodu Mla

Munugodu Mla

‘పదవులు మీకే.. పైసలూ మీకేనా’ అంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు.. తన నియోజకవర్గ అభివృద్ధికి అయినా డబ్బులు ఇవ్వండి అని సీఎంను రాజగోపాల్‌ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన సర్దార్‌ వల్లభ్‌భాయి పటేల్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పాల్గొన్నారు. విగ్రహాన్ని ఆవిష్కరణ అనంతరం సొంత పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.

‘వలిగొండ-చౌటుప్పల్‌ రోడ్డు బిల్లు రావడం లేదని కాంట్రాక్టర్‌ పనులు ఆపేశాడు. బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ఇస్తే వస్తుంది. అందుకే సీఎంనే నేరుగా అడుగుతున్నా. సీఎం, కాంగ్రెస్ పార్టీని నేను విమర్శించడం లేదు. నా నియోజకవర్గంకు రావాల్సిన నిధులు అడుగుతున్నా. 20 నెలల నుంచి నా నియోజకవర్గంలో రోడ్లకు, బిల్డింగులకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నేనే స్వయంగా మంత్రి దగ్గరకు వెళ్లి అడిగినా బిల్లులు రాలేదు. వందసార్లు తిరిగినా రాలేదు. అందుకే పదవులలో మీరే ఉంటారు.. నిధులు మీరే తీసుకుంటున్నారు అని అడగాలా వద్దా?. కనీసం నాకు పదవి ఇవ్వనందుకు.. నా నియోజకవర్గ అభివృద్ధికి డబ్బులు అయినా ఇవ్వండి. నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, నా మునుగోడు నియోజకవర్గంకు నిధులు ఇవ్వండి’ అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కోరారు.

Also Read: Asia Cup 2025: ఆ ఐదుగురు స్టార్స్‌కు నో ప్లేస్.. గిల్‌ కూడా డౌటే!

‘మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. పదవి వచ్చేటప్పుడు.. ఎవ్వరు ఆపినా ఆగదు. పదవి వస్తే మునుగోడు నియోజకవర్గ ప్రజలకే న్యాయం జరుగుతుంది. నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి నేతలను ఎన్నుకోవాలి. ఎందుకంటే వారితో కలిసి నేను మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం కోట్లాడాలి’ అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఇటీవలి రోజుల్లో రాజగోపాల్‌ రెడ్డి సొంత పార్టీపైనే మండిపడుతున్నారు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Exit mobile version