NTV Telugu Site icon

AP Weather: రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం.. దక్షిణకోస్తా, రాయలసీమకు భారీ వర్ష సూచన

Tg Rains Alert

Tg Rains Alert

ఐఎండీ సూచనల ప్రకారం నైరుతి.. దానిని ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గడిచిన ఆరు గంటల్లో గంటకు 17 కి.మీ వేగంతో కదులుతుందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. బుధవారం సాయంత్రానికి వాయుగుండం చెన్నైకి 190 కి.మీ., పుదుచ్చేరికి 250 కి.మీ, నెల్లూరుకి ఆగ్నేయంగా 270కి.మీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తరువాత క్రమంగా బలహీనపడుతుందని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హోం మంత్రి అనిత సూచించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తీవ్రతను బట్టి సూచనలు జారీ చేసారు. రేపు తీరం దాటిన తరువాత కుడా ఎటువంటి పరిస్థితులనైన ఎదుర్కోడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైన విద్యుత్ అంతరయం కలిగితే తక్షణం పునరుద్ధించడానికి పోల్స్, వైర్లతో విద్యుత్ సిబ్బంది రెడీగా ఉన్నట్లు తెలిపారు. రోడ్లు మీద చెట్లు పడితే వెంటనే తొలగించడానికి జేసీబీలు అందుబాటులో ఉంచామన్నారు. భారీ వర్షాలతో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపారు. ప్రస్తుత వర్షభావ పరిస్థితులను బట్టి ప్రకాశం 4, నెల్లూరు 10, అన్నమయ్య 4, అనంతపురం 2 తిరుపతి 14 మండలాల్లో భారీ వర్షాలు ఎక్కువ ప్రభావం చూపినట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం నెల్లూరు, తిరుపతి, కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో.. 5 ఎస్డీఆర్ఎఫ్, 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 827 మందిని సురక్షిత ప్రాంతాలకు.. 2,222 మందిని పునరావాస కేంద్రాలకు తరిలించామన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన 61,756 మంది మత్స్యకారులను వెనక్కి రప్పించామని తెలిపారు.

Nani Odela 2 : తస్సాదియ్యా.. అన్నంత పని చేశారు.. ఇక అరాచకమే

వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వర్షాల కారణంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే పెన్నా నది పరీవాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రానున్న రెండు రోజులు వాతావరణం క్రింద విధంగా ఉండనున్నట్లు వివరించారు.
17 అక్టోబర్, గురువారం:
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు, కృష్ణా, గుంటూరు మరియు బాపట్ల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
18 అక్టోబర్, శుక్రవారం:
• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
• గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

బుధవారం సాయంత్రం 7 గంటల నాటికి తిరుపతి జిల్లా ఏర్పేడులో 97.7మిమీ, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో 82మిమీ, పుల్లంపేటలో 81మిమీ, తిరుపతి జిల్లా రేణిగుంటలో 71.5మిమీ, వెంకటగిరిలో 68.5మిమీ, శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో 67.5 మి.మీ, నెల్లూరు రూరల్ లో 67 మి.మీ చొప్పున భారీ వర్షాలు నమోదైనట్లు తెలిపారు.