NTV Telugu Site icon

Delhi floods: నీట మునిగిన జలమంత్రి అతిషి నివాసం.. పలువురి మంత్రులు, ఎంపీల ఇళ్లు

Dkee

Dkee

రెండ్రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అయింది. దీంతో రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం.. ఇంకోవైపు ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయింది.

భారీ వర్షం కారణంగా సాధార‌ణ పౌరుల‌తో పాటు రాజ‌కీయ నేత‌లు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు వ‌ర్షాల‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్లమెంట్ స‌మావేశాల నేప‌ప‌థ్యంలో ఢిల్లీలో ఉన్న ప‌లువురు ఎంపీల నివాసాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకున్నాయి. ఇంటి చుట్టూ నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. త‌న ఇల్లంతా వ‌ర్షపు నీరుతో నిండిపోయిన‌ట్లు కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ పేర్కొన్నారు. ఇంట్లో అడుగు ఎత్తు నీరు చేరిపోయింద‌ని. ప్రతి గ‌దిలో కార్పెట్‌లు, ఫర్నీచర్‌ ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. అంతేగాక క‌రెంట్ షాక్ వ‌స్తుంద‌నే ఉద్ధేశంతో ఉద‌యం 6 గంట‌ల నుంచి అధికారులు విద్యుత్‌ను నిలిపివేసిన‌ట్లు తెలిపారు. ఇక ఢిల్లీ జల మంత్రి అతిషి నివాసం కూడా నీట మునిగింది. ఇటీవల ఢిల్లీలో నీటి కొరత నేపథ్యంలో నిరాహార దీక్ష చేశారు. తాజాగా మంత్రి నివాసం దగ్గర నీరు చేరిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మ‌రోవైపు భారీ వ‌ర్షాల‌తో లోధి ఎస్టేట్ ప్రాంతంలోని తన బంగ్లా వెలుపల రహదారి జలమయం కావడంతో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంటిముంందు ఉన్న నీటిలో నుంచి కారు దగ్గరకు వెళ్లేందుకు సిబ్బంది ఎత్తుకొని తీసుకెళ్లారు. తన బంగ్లా మొత్తం జలమయమైందని ఎంపీ తెలిపారు. రెండు రోజుల క్రితమే ఫ్లోరింగ్‌ పూర్తి చేశామని.. లక్షల్లో నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది.

ఇక భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు కూడా జలమయం అయింది. పైకప్పు నుంచి వర్షం నీరు కారుతుంది. ఇంకో వైపు టెర్నినల్ -1 పైకప్పు కూలిపోవడంతో ఒకరు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఇక తాజా పరిణామాలపై మంత్రి అతిషి సమీక్ష నిర్వహించారు.