NTV Telugu Site icon

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు!

Rain Alert

Rain Alert

Rains To Fall in AP and Telangana due to Low Pressure in Bay of Bengal: 5 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారం (ఆగష్టు 18) నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల వర్షాలు కురియగా.. ఆకాశం మొత్తం మేఘావృతం అయి ఉంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాలపై అల్పపీడన మేఘాలు ఆవరించి ఉన్నాయి.

అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తా, యానాంలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు. ఇక గుంటూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పు గోదావరి, కృష్ణా, కాకినాడ జిల్లాల్లో గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. గుంటూరు జిల్లా రావెల ప్రాంతంలో 8 సెంమీ వర్షపాతం నమోదైంది.

Also Read: Gold Today Price: మగువలకు పండగ లాంటి వార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! తులం పసిడి ఎంత ఉందంటే?

నేడు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దాంతో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. మరోవైపు నిర్మల్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ములుగు, సిరిసిల్ల, మహబూబాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. లోతు ప్రాంతాల్లో వారు ఈ 2-3 రోజులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.