Raihan Vadra Photo Exhibition Row: కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా దంపతుల కుమారుడు రైహాన్ వాద్రా (Raihan Vadra) ఫొటో ఎగ్జిబిషన్ వివాదం సంచలనంగా మారింది. ఈ ఎగ్జిబిషన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య అంతర్గత పోరు నడుస్తోందని బీజేపీ శుక్రవారం తీవ్ర ఆరోపణలు చేసింది. రైహాన్ ఫొటోల తొలగింపుపై పెద్ద రచ్చ జరుగుతున్నప్పటికీ, విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించకుండా మౌనంగా ఉండటమే ఇందుకు నిదర్శనమని బీజేపీ పేర్కొంది. రాహుల్ గాంధీపై ప్రియాంక పూర్తిగా నమ్మకం కోల్పోయారని.. తన కుమారుడిని పొలిటికల్‌గా ‘సాఫ్ట్ లాంచ్’ చేయడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. గత ఆదివారం వ్యక్తిగత పర్యటన నిమిత్తం వియత్నాం వెళ్లిన రాహుల్ గాంధీ, అక్కడి నుంచి దేశంలోని ప్రతి అంశంపైనా ట్వీట్లు చేస్తున్నారని, కానీ తన అల్లుడు రైహాన్ వాద్రాకు మద్దతుగా ఇప్పటివరకు ఒక్క ట్వీట్ కూడా చేయలేదని భండారీ ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్‌లో “ప్రియాంక వర్సెస్ రాహుల్” గొడవను స్పష్టంగా చూపిస్తోందన్నారు. అయితే, కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వ్యవహార శైలిపై, ఎస్ఐఆర్ అక్రమాలపై రాహుల్, ప్రియాంకలు ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.
అసలు ఏంటి ఈ వివాదం..?
ప్రముఖ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్ అయిన రైహాన్ వాద్రా ‘నో ఐడియా ఈజ్ ఫైనల్’ పేరుతో ఢిల్లీలోని బికనేర్ హౌస్‌లో ఒక ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించాలని అనుకున్నారు. అయితే, ఎగ్జిబిషన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు, ఢిల్లీలో ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఫొటోలను తొలగించాలని బికనేర్ హౌస్ యజమాన్యం ఆయనను కోరింది. మొత్తం 105 ఫొటోలలో 74 ఫొటోలను తొలగించాలని లేదా మార్చాలని చెప్పడంతో చివరికి కేవలం 35 ఫొటోలతోనే ప్రదర్శనను ప్రారంభించాల్సి వచ్చింది. యువత గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ పని చేసిందంటూ ప్రియాంక గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు బికనేర్ హౌస్ యజమాన్యం స్పందిస్తూ… ఆ ఫొటోలు తమ వేదిక నిబంధనలు, విధానాలకు అనుగుణంగా లేకపోవడం వల్లే వాటిని తొలగించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ఇక బీజేపీ ఈ విషయంలో మరో కోణాన్ని బయటపెట్టింది. రైహాన్, బికనేర్ హౌస్ మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణల స్క్రీన్షాట్లను సోషల్ మీడియాలో పంచుకుంది. జూన్ 10న రైహాన్ పంపిన ప్రారంభ ప్రతిపాదనలో ప్రకృతి, వన్యప్రాణులు, అబ్స్ట్రాక్ట్ ఆర్ట్‌వర్క్, పోర్ట్రెయిట్స్, శిల్పాలు వంటి అంశాలు మాత్రమే ఉన్నాయని, అందులో ఎలాంటి రాజకీయ అంశాలు లేవని ప్రదీప్ భండారీ తెలిపారు. ఆ ప్రపోజల్‌ను బికనేర్ హౌస్ జూన్ 30న ఆమోదించింది. గత మూడేళ్లుగా ఈ ఎగ్జిబిషన్ కోసం పని చేస్తున్న రైహాన్‌కు అక్కడి బుకింగ్ నిబంధనలు బాగా తెలుసని, అందుకే మొదట్లో ఎలాంటి రాజకీయాంశాలు లేని ఫొటోలను పంపారని బీజేపీ పేర్కొంది. కానీ, కుటుంబ సభ్యుల ఒత్తిడితో తన కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకే ఆ తర్వాత రాజకీయ ఫొటోలను అందులో చేర్చారని, దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అక్టోబర్ 21న బికనేర్ హౌస్ రైహాన్‌కు నోటీసు ఇచ్చిందని భండారీ వివరించారు. ఈ ఈమెయిల్ ఆధారాలు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెప్తున్న అబద్ధాలను పూర్తిగా బయటపెట్టాయని బీజేపీ వ్యాఖ్యానించింది.

