NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్‌లో ఏంటి ఈ మార్పు.. ఆశ్చర్యపోతున్న రాజకీయ నేతలు..!

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: గాంధీ కుటుంబం వారసుడిగా, సోనియా గాంధీ కొడుకుగా ముద్రపడిన రాహుల్.. ఇపుడు తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. నడకలో, నడతలో.. వేసే ప్రతి అడుగులో తనను తాను జన్‌నాయక్‌గా.. ది లీడర్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. కర్ణాటక సిటీ బస్సు ఎక్కి జనాలతో మాట్లాడినా.. లారీ ఎక్కి డ్రైవర్ల కష్టాలు విన్నా.. యుఎస్‌లో ట్రక్‌ ఎక్కినా.. తాజాగా వరి నాట్లు వేసినా.. ఇలా ఏది చేసినా రాహుల్‌ను ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. జోడోయాత్రలో పాపను తన భూజాలపై ఎత్తుకొని నడిచినా.. చిన్నారికి లేస్‌ కట్టినా.. ఇదంతా చేస్తున్నది రాహులేనా అని ప్రజలతో పాటు రాజకీయ నేతలు ఆశ్చర్యపోతున్నారు.

కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారు రాహుల్. ఈ యాత్రలో ప్రతీ అడుగు.. ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. జనాలకు చేరువయితే.. ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో.. జోడో యాత్ర చెప్పకనే చెప్పింది. అందుకే యాత్ర ముగిసిన తర్వాత కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎన్నికల కోసమే ఈ స్టంట్‌లు అని ఎవరైనా అనొచ్చు.. ఇలాంటి పలకరింపులు, పర్యటనలు, పరామర్శలు.. కాంగ్రెస్‌ను గెలిపించొచ్చు, గెలిపించకపోవచ్చు. కానీ జనాల మనసును రాహుల్ గెలవడం మాత్రం పక్కా. నిజానికి ఇప్పుడు రాహుల్ ఎంపీ కాదు. కోర్టు తీర్పుతోనే కేంద్రం ఆ నిర్ణయం తీసుకుందా.. బీజేపీ కుట్ర ఉందా అన్న సంగతి ఎలా ఉన్నా.. అనర్హత వేటు పడిన తర్వాత రాహుల్‌లో కసి కనిపిస్తోంది.

భారత్‌ జోడో యాత్ర తర్వాత.. రాహుల్ గాంధీ తన స్టైల్‌ను మార్చేశారు. నిత్యం జనంలో ఉండేందుకు మొగ్గుచూపుతున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు…ప్రజలతో కలిసి పోతున్నారు. గంటల కొద్దీ వారితోనే గడుపుతూ.. వారి కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. ఎక్కడికి వెళితే అక్కడ.. వారు వీరు అని చూడకుండా.. చేతులు కలుపుతున్నారు. గంటల కొద్దీ వారితోనూ ఉన్నారు. వారితోనే ప్రయాణిస్తూ.. వారు చేసే పనులనే చేస్తున్నారు. మీలో నేను ఒకడినంటూ.. కష్టసుఖాలను తెలుసుకుంటున్నారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్నారు. సామాన్యుల కష్టాలను తెలుసుకునేందుకు జనంలోకి వెళుతున్నారు రాహుల్ గాంధీ. హిమాచల్ ప్రదేశ్ కు బయలుదేరిన రాహుల్ గాంధీ.. హర్యానాలోని సోనిపట్ లోని ఓ పొలం వద్ద కారు ఆపి దిగారు. పక్కనే పొలంలో నాట్లు వేస్తున్న రైతులను పలకరించారు. మహిళలతో కలిసి కాసేపు నాట్లు వేశారు. ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నారు.

కర్ణాటక ఎన్నికల సందర్భంగా.. బెంగళూరులో ఓ డెలివరీ బాయ్​ స్కూటీపై రాహుల్ గాంధీ ప్రయాణించారు. సుమారు రెండు కిలోమీటర్లు అతడితోపాటు ప్రయాణించి సందడి చేశారు. ఆయన వెనుక సెక్యూరిటీ గార్డులు పరుగులు తీశారు. డెలివరీ బాయ్​తో పాటు హోటల్​కు చేరుకున్న రాహుల్​ను చూసి చుట్టు పక్క ప్రజలు గుమిగూడారు. కార్యకర్తలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. అక్కడే ఉన్న చిన్నారులతో ముచ్చటించారు. కాసేపు సరదాగా గడిపారు. బెంగళూరులో సిటీ ప్రయాణించి.. కర్ణాటక ప్రజలను ఆశ్చర్య పరిచారు. మహిళలను కలిసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

కొద్దిరోజుల క్రితమే ఢిల్లీ నుంచి చండీగఢ్​ వెళ్లే ఓ ట్రక్కు డ్రైవర్​ వాహనంలో ప్రయణించారు రాహుల్​ గాంధీ. హిమాచల్ ప్రదేశ్​లోని శిమ్లాకు వెళ్తున్న రాహుల్.. మార్గమధ్యంలో ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. వారి సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఓ దాబా వద్ద డ్రైవర్లతో కలిసి భోజనం చేశారు. అగ్రరాజ్యం అమెరికాలో ఈ ప్రయాణాన్ని చేపట్టారు. అక్కడ జీవనం కోసం వెళ్లిన భారత సంతతికి చెందిన కొందరు ట్రక్కు డ్రైవర్​ల సమస్యలను తెలుసుకునేందుకు స్వయంగా వారితో కలిసి ప్రయాణం చేశారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. వాషింగ్టన్​ నుంచి న్యూయార్క్​ నగరం వరకు…దాదాపు 190 కిలోమీటర్ల పాటు ట్రక్కు ప్రయాణం కొనసాగింది. భారతదేశంలో పెరుగుతున్న వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం, రాజకీయాలపై ట్రక్కు డ్రైవర్లు​ తల్జీందర్ సింగ్, విక్కీ గిల్​తో చర్చించారు రాహుల్​ గాంధీ.

ఢిల్లీలోని కరోల్‌ బాగ్‌ సైకిల్‌ మార్కెట్‌లోని.. ఓ బైక్‌ రిపేర్‌ దుకాణానికి రాహుల్‌ వెళ్లారు. మోటారు సైకిళ్లను ఎలా రిపేర్‌ చేయాలో మెకానిక్‌లను అడిగి తెలుసుకున్నారు. వారితో మమేకమయ్యారు. సైకిల్‌ మార్కెట్‌లోని వ్యాపారులు, కార్మికులు, బైక్‌ మెకానిక్‌లతో మాట్లాడారు. కొంతకాలం క్రితం ఢిల్లీలోని జేఎన్‌యూ వెళ్లి.. వారితోనే కలిసి భోజనం చేశారు. వారితో ముచ్చటించారు. ఎంపీగా వేటు పడిన తర్వాత.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు రాహుల్ గాంధీ. నీలి మబ్బులు వలస వెళ్లిపోతే ఆకాశమే దిగివచ్చినట్లు.. ఇప్పుడదే చేస్తున్నారు రాహుల్‌. ఇన్నాళ్లు ఢిల్లీ నివాసం, పార్టీ ఆఫీస్‌కు మాత్రమే పరిమితమైన రాహుల్‌.. ఇప్పుడు జనం వైపు అడుగులు వేస్తున్నారు. కలుస్తున్నారు.. కష్టాలు తెలుసుకుంటున్నారు.. నవ్వుతున్నారు.. ఏడుస్తున్నారు.. ఏడిపిస్తున్నారు.. ఇలా మీలో ఒకడిని అనే సంకేతాన్ని జనాలకు పంపిస్తున్నారు. జన నాయకుడు ఎలా ఉంటాడో.. చేసి చూపిస్తున్నారు రాహుల్ గాంధీ.