NTV Telugu Site icon

Rahul Gandhi : వైఎస్సార్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకొని రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అయితే.. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్‌కు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ నివాళులు అర్పించారు. రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బ‌తికి ఉంటే ఏపీ ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌న్నారు. ఆయ‌న‌ను కోల్పోవ‌డం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోట‌ని చెప్పారు. వైఎస్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని ష‌ర్మిల కొన‌సాగిస్తార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. తాను ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర‌కు ఒక ర‌కంగా వైఎస్సార్ పాద‌యాత్ర స్ఫూర్తి అని అన్నారు. ప్రజానీకానికి నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయ‌న అంకితభావం, నిబద్ధత చాలా మందికి మార్గదర్శకమ‌న్నారు. వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నాన‌ని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజా జీవితానికే ప్రాధాన్య‌త‌నిచ్చిన మ‌హా నాయ‌కుడ‌ని రాహుల్ కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సంద‌ర్భంగా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకుంటున్న‌ట్లు తెలిపారు.