NTV Telugu Site icon

Rahul Gandhi: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్.. కాంగ్రెస్ ఆందోళనలు ఉద్ధృతం

Rahul123

Rahul123

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని గత రెండు రోజుల పాటు విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌.. వరుసగా మూడో రోజూ విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో ఇవాళ కూడా ఆయన ఈడీ ఎదుట హాజరయ్యారు. గత రెండు రోజుల్లో దాదాపు 21 గంటల పాటు రాహుల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. రాహుల్​ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్​ ఆందోళనలు ఉద్ధృతంగా మారాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీ స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు.

రాహుల్ సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆర్ధిక లావాదేవీలు, బ్యాంకు లావాదేవీల గురించి సరైన సమాధానాలు ఇవ్వడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆయన 80 ప్రశ్నలకు సమాధానాలు చెప్పినట్లు వెల్లడించాయి. అయితే, రాహుల్ పదేపదే తన వాంగ్మూలాన్ని మార్చుకోవడం వల్ల విచారణ ఆలస్యమైందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

రాహుల్‌పై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ దిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. బుధవారం కూడా కాంగ్రెస్‌ ఆందోళన కొనసాగుతోంది. అయితే సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటనల దృష్ట్యా ఈడీ కార్యాలయం సహా రాహుల్‌ నివాసం, కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్‌ చుట్టూ 144 సెక్షన్‌ విధించారు.