Site icon NTV Telugu

Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం!

Rahul Dravid Rr

Rahul Dravid Rr

భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ (ఆర్ఆర్) హెడ్ కోచ్‌ పదవి నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. తాము ఆఫర్‌ చేసిన పదవిని ద్రవిడ్‌ వద్దన్నారని తెలిపింది. ఆర్‌ఆర్‌కు సేవలు అందించినందుకు ధన్యవాదాలు చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు ద్రవిడ్ రాజస్థాన్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. అతడు ఒక సీజన్ వరకే హెడ్ కోచ్‌గా సేవలు అందించారు. ఇక రాజస్థాన్‌ కొత్త కోచ్‌ కోసం అన్వేషణ మొదలు పెట్టనుంది.

రాహుల్ ద్రవిడ్ 2024 టీ20 ప్రపంచకప్ వరకు టీమిండియాకు హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. టీమిండియా హెడ్ కోచ్‌గా స్వయంగా తప్పుకొన్న ద్రవిడ్‌.. అదే ఏడాది రాజస్తాన్‌ రాయల్స్‌ ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యారు. ఐపీఎల్ 2025లో ఆర్‌ఆర్‌కు సేవలు అందించారు. ద్రవిడ్ నాయకత్వంలో రాజస్థాన్ 2025 సీజన్‌లో ఎలాంటి ముద్ర వేయలేకపోయింది. 14 మ్యాచ్‌లలో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అయితే 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీని వెలుగులోకి తీసుకురావడానికి ద్రవిడ్‌ది కీలక పాత్ర ఉంది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ద్రవిడ్‌ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే సంజూ వేరే ఫ్రాంఛైజీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ద్రవిడ్‌ తప్పుకోవడం ఇక్కడ గమనార్హం.

‘రాహుల్ ద్రవిడ్ తన హెడ్ కోచ్‌ పదవి నుంచి వైదొలిగారు. రాజస్థాన్‌ రాయల్స్‌తో చాలా కాలం పాటు ప్రయాణించారు. ఆర్ఆర్ ఆటగాళ్లపై ఆయన ప్రభావం చాలా ఉంది. ఫ్రాంచైజీలో సంప్రదాయం నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. ఫ్రాంచైజీలో ఉన్నత స్థానం ఇస్తామని ఆఫర్ చేసినా.. తిరస్కరించారు. రాజస్థాన్‌ ఆటగాళ్లు, అభిమానుల నుంచి ద్రవిడ్‌కు ధన్యవాదాలు. ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేం’ అని ఆర్ఆర్ ట్వీట్ చేసింది. ఐపీఎల్‌ 2012, 2013 సీజన్లలో ద్రవిడ్‌ రాజస్తాన్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ఐపీఎల్ రిటైర్మెంట్‌ అనంతరం రాజస్తాన్‌ ఫ్రాంఛైజీకి రెండేళ్లు మెంటార్‌నూ వ్యవహరించారు.

Exit mobile version