Ragi Pittu: ఈ రోజుల్లో పోషకాహార లోపం కారణంగా చిన్న వయసులోనే ఆడపిల్లలు నడుము నొప్పి, నీరసం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పట్లో మన అమ్మమ్మలు, నానమ్మలు రజస్వల అయిన సమయంలో లేదా బాలింతలకు ప్రత్యేకంగా రాగి పిట్టు అనే వంటకాన్ని చేసి పెట్టేవారు. నడుము నొప్పి, రక్తహీనత వంటి సమస్యలతో బాధపడే ఆడపిల్లలకు, అలాగే ఇంట్లోని పెద్దలకు ఎంతో మేలు చేసే పాతకాలపు అరుదైన వంటకం ఈ ‘రాగి పిట్టు’. ఇందులో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ బలమైన ఆహారాన్ని మళ్లీ మన డైట్‌లో చేర్చుకోవడం ఎంతో అవసరం. ఈ హెల్తీ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: ASUS Zenbook S16: 16GB RAM, OLED డిస్ప్లేతో.. ఆసుస్ జెన్‌బుక్ ల్యాప్‌టాప్స్ విడుదల.. ధర ఎంతంటే?
రాగి పిట్టు తయారీకి కావాల్సినవి:
రాగి పిండి – 1 కప్పు
తురిమిన బెల్లం – 1/3 కప్పు
తురిమిన ఎండు కొబ్బరి – 1 కప్పు
యాలకుల పొడి – అర టీస్పూన్
నెయ్యి – 2 నుండి 3 స్పూన్లు
డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు (వేయించినవి)
ఉప్పు – చిటికెడు
తయారీ విధానం:
ముందుగా ఒక పళ్ళెంలో రాగి పిండి తీసుకుని, చిటికెడు ఉప్పు వేయాలి. అందులో నీళ్లు కొంచెం కొంచెంగా చిలకరిస్తూ పిండిని పొడిపొడిగా కలుపుకోవాలి. పిండిని చేత్తో ఉండ చేస్తే ముద్ద అవ్వాలి, వదిలితే విడిపోవాలి.. ఆ స్థితిలో ఉండాలి. ఇలా కలిపిన పిండిని జల్లెడ పడితే ఉండలు లేకుండా మెత్తగా వస్తుంది. ఒక పాత్రలో సగం వరకు నీళ్లు పోసి, పైన పలుచని కాటన్ క్లాత్‌ను గట్టిగా కట్టాలి. ఆ క్లాత్ పై రాగి పిండి వేసి, దాని పైన కూడా క్లాత్‌తో కప్పి మూత పెట్టాలి. ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో దానిని ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి, పిండి పైన చిన్న చిన్న రంధ్రాలు చేసి, కొద్దిగా నీళ్లు చిలకరించి మరో 15 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. పిండిని నలిపితే ముద్దలా అయితే అది పర్ఫెక్ట్‌గా ఉడికినట్లు లెక్క. ఉడికిన పిండిని పళ్ళెంలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు తురిమిన ఎండు కొబ్బరి, బెల్లం, యాలకుల పొడిని దానికి వేసి బాగా కలపాలి. చివరిగా నెయ్యి, వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు చేర్చి ఉండల్లాగా చుట్టుకోవాలి.
ప్రయోజనాలు ఇవే:
రాగుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది.
ఇందులో ఉండే ఐరన్ వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.
నెలలో కనీసం రెండు మూడు సార్లు ఈ పిట్టు తినడం వల్ల ఆడపిల్లల్లో ఫ్యూచర్‌లో వచ్చే నడుము నొప్పులు దరిచేరవు.
అతి తక్కువ ఖర్చుతో, సులభంగా తయారు చేసుకునే ఈ పోషక విలువల గనిని మీరు కూడా మీ ఇంట్లో కుదిరినప్పుడు తప్పకుండా ప్రయత్నించండి.
READ ALSO: Iran Hit List: ఇరాన్ టార్గెట్‌లో ఆ దేశాధినేతే ఫస్ట్.. ఎవరో తెలుసా?
