హరియాణాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 25 ఏళ్ల రాధికాను ఆమె తండ్రి దీపక్ యాదవ్ (49) గన్‌తో కాల్చిచంపాడు. గురువారం (జులై 10) రాధికా ఇంట్లో వంట చేస్తుండగా.. దీపక్ వెనక నుంచి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో టెన్నిస్ ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. నేరాన్ని అంగీకరించిన దీపక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హత్య ఘటనకు కొన్ని రోజుల ముందే దీపక్ యాదవ్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. దీపక్ గత 15 రోజులుగా సరిగా నిద్రపోలేదని, ఇంట్లో విశ్రాంతి లేకుండా తిరిగేవాడని, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదని పోలీసులు తెలిపారని కొన్ని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. కొంతకాలంగా దీపక్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, రాధిక తన తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చేదని పేర్కొన్నాయి. దీపక్ కొన్ని రోజుల క్రితం వజీరాబాద్‌లోని తన గ్రామానికి వెళ్లగా.. అక్కడ కొంతమంది గ్రామస్థులు ఆయనపై విమర్శలు చేశారు. దీపక్ కుమార్తె ఆదాయంతో జీవిస్తున్నాడని ఎగతాళి చేశారు. కూతురు రాధికను కంట్రోల్‌లో పెట్టలేకపోతున్నాడని విమర్శించారు.
Also Read: Gold Rate Today: భారీ షాకిస్తున్న బంగారం.. మళ్లీ లక్షకు చేరువలో పసిడి! వెండిపై ఏకంగా 4 వేలు
గ్రామం నుంచి తిరిగి వచ్చాక టెన్నిస్ అకాడమీని మూసివేయాలని రాధికతో దీపక్ అనేకసార్లు వాదించాడు. రూ.2 కోట్లు ఖర్చు చేసి నేర్చుకున్న కెరీర్‌ను వదులుకోనని, తన ప్రతిభతో పిల్లలకు టెన్నిస్ శిక్షణ ఇస్తాను తండ్రితో చెప్పింది. రాధిక మాటలకు నిరాశ చెందిన దీపక్.. తన ప్రాణాలను తీసుకునేందుకు ప్రయత్నించాడు. చివరకు కూతురినే చంపాడు. ఘటన జరిగిన రోజు కూడా ఇరువురి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం సాయంత్రం రాధిక అంత్యక్రియలు జరిగాయి. సోదరుడు ధీరజ్ ఆమె చితికి నిప్పంటించాడు. రాధిక కుటుంబంతో సహా దాదాపు 150 మంది అంత్యక్రియలకు హాజరయ్యారు. రాధికకు నాలుగు బుల్లెట్లు తగిలాయని పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. మూడు వెనుక భాగంలో, ఒకటి భుజంలో తగిలిందని పోలీసులు తెలిపారు.
