Site icon NTV Telugu

Adulterated Milk Racket: చూడటానికి అచ్చం పాల లాగే ఉంటాయి.. కానీ పాలు కాదు, కాలకూట విషం!

Adulterated Milk Racket

Adulterated Milk Racket

చూడటానికి అచ్చం పాల లాగే ఉంటాయి.. కానీ పాలు కాదు. ప్రమాదకర రసాయనాలతో వాటిని తయారు చేసి నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు అని చెప్పి అమ్మేస్తున్నారు కొంత మంది దుండగులు. కనీసం చిన్న పిల్లలు తాగుతారన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి భరతం పట్టారు రాచకొండ పోలీసులు. ఇంకా చెప్పాలంటే పలు ప్రమాదకర రసాయనాలు మిక్స్ చేసి తయారు చేసిన పాలు ఇవి. వీటిని స్వచ్ఛమైన పాలు అని నమ్మించి జనానికి అమ్మేస్తున్నారు కొందరు పాపాల భైరవులు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పలు గ్రామాల్లో కల్తీ పాల కేంద్రాలపై ఐదు రోజులుగా వరుసగా దాడులు చేస్తున్నారు SOT పోలీసులు. దీంతో ఈ విషయం బయటపడింది. భువనగిరి రూరల్ పీఎస్ పరిధిలోని మన్నేవారి పంపు గ్రామంలో ఓ కల్తీ పాల కేంద్రాన్ని ఎస్ఓటి పోలీసులు గుర్తించారు. అలాగే కనుముక్కల గ్రామంలోనూ మరో కల్తీ పాల కేంద్రం బయటపడింది. ఈ పాల కేంద్రాలలో హైడ్రోజన్ పెరాక్సైడ్, స్కిమ్డ్ మిల్క్ పౌడర్ కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

Also Read: Cyber Crime: వల విసిరారు.. ఉసురు తీశారు!

ఈ కల్తీపాలను తయారు చేస్తున్న సామల సత్తిరెడ్డి, కుంభం రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 180 లీటర్ల కల్తీపాలు, 700 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 12 కిలోల మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కల్తీ పాలను ఉప్పల్, ఎల్బీనగర్, మలక్‌పేటలోని పలు స్వీట్ హౌస్‌లకు సరఫరా చేస్తున్నారు. వాటి ద్వారా తయారైన స్వీట్లను జనానికి అమ్ముతున్నారు ఆయా స్వీట్ హౌజ్‌ల యజమానులు. ఫలితంగా ఈ స్వీట్లు తింటున్న వారు ప్రమాదకరమైన రోగాల బారిన పడుతున్నారు.

Exit mobile version