Site icon NTV Telugu

Healthy Breakfast: తక్కువ టైం.. ఎక్కువ హెల్త్! బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి రాగి రొట్టె సూపర్ ఛాయిస్..

Ragi Roti

Ragi Roti

Healthy Breakfast: నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సమయం ఉండటం లేదు చాలా మందికి. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా గుర్తుకు ఉంచుకోవడం మరిచిపోవద్దు.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా చాలా ముఖ్యం అనే విషయాన్ని. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడే వారికి చిరుధాన్యాలు (మిల్లెట్స్) ఒక వరప్రదాయినిగా నిపుణులు చెబుతున్నారు. చిరుధాన్యాల్లో రారాజుగా పిలిచే రాగులతో చేసే వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఒంటికి ఎంతో బలాన్నిస్తాయి. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ఫైబర్ ఉండే రాగి రొట్టెలను అప్పటికప్పుడు సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

READ ALSO: Tata Punch EV: హైటెక్ ఫీచర్లతో.. టాటా Punch.ev ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ వచ్చేస్తోంది

కావలసిన పదార్థాలు:

రాగి పిండి – 2 కప్పులు

ఉల్లిపాయ తరుగు – 1 కప్పు

ఆకుకూరలు (మెంతి, తోటకూర లేదా పాలకూర) – 2 కప్పులు

పచ్చిమిర్చి తరుగు – 1 టేబుల్ స్పూన్

అల్లం తురుము – 1 టీస్పూన్

నానబెట్టిన పచ్చి శనగపప్పు – 1/4 కప్పు

కొత్తిమీర, కరివేపాకు తరుగు – తగినంత

ఉప్పు, ఇంగువ, చిల్లీ ఫ్లేక్స్ – రుచికి సరిపడా

తయారీ విధానం:
ఒక వెడల్పాటి పాత్రలో రాగి పిండిని తీసుకుని, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర వేయాలి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, మెంతికూర లేదా మీకు నచ్చిన ఏదైనా ఆకుకూరను కలిపి తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ వేయాలి. కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ రొట్టెలు ఒత్తుకోవడానికి వీలుగా ఉండేలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెడితే పిండి బాగా నానుతుంది. పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని, అరిటాకుపై గానీ లేదా బటర్ పేపర్ పైన గానీ నూనె రాసి పల్చగా ఒత్తుకోవాలి. లేదా నేరుగా పెనం మీద కూడా ఒత్తుకోవచ్చు. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె రాసి, ఈ రొట్టెను రెండు వైపులా ఎర్రగా కాలే వరకు చిన్న మంట మీద కాల్చాలి. మంట తక్కువగా ఉంటేనే రొట్టె లోపల వరకు ఉడికి క్రిస్పీగా తయారవుతుంది.

పల్లి చట్నీతో తింటే ఉంటుంది..
ఈ రాగి రొట్టెలకు ఎండుమిర్చి, పల్లీలు, వెల్లుల్లి, చింతపండు వేసి చేసిన పల్లి చట్నీ అద్భుతమైన కాంబినేషన్. నూనె తక్కువగా వాడుతూ చేసే ఈ చట్నీ రొట్టె రుచిని మరింత పెంచుతుంది. రాగుల్లో ఉండే క్యాల్షియం, ఐరన్ ఎముకల పుష్టికి, రక్తహీనత నివారణకు తోడ్పడతాయి. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఈ రాగి రొట్టెలు ఎంతో మేలు చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం? అప్పటికప్పుడు తయారు చేసుకోగలిగే ఈ పోషకాల గనిని మీరు కూడా మీకు కుదిరినప్పుడు ఇంట్లో ప్రయత్నించండి.

READ ALSO: Allu Cinemas: ‘ధురంధర్ 2’తో.. ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్!

Exit mobile version