Site icon NTV Telugu

Off The Record : పీవీపీకి తిరిగి వైసీపీ టిక్కెట్ దక్కదా..?

Pvp

Pvp

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒకప్పుడు విపరీతంగా నానిన పేరు అది. సినీ రంగానికి చెందిన వ్యక్తిగా… అంతకు మించి వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా 2019 ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన వ్యక్తి ఆయన. ఎన్నికల తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే..ఎందుకో సడన్‌గా మాయమైపోయారు ఆయన. కానీ.. ఇప్పుడు ఉన్నట్టుండి ట్వీట్స్‌తో హీట్‌ పెంచే ప్రయత్నం చేస్తున్నారట. ఎవరా ప్రముఖుడు? ఎందుకలా చేస్తున్నారు?

పొట్లూరి వరప్రసాద్‌ అలియాస్‌ పీవీపీ. 2019 ఎన్నికల టైంలో చాలా మంది దృష్టిని ఆకర్షించారాయన. విజయవాడ పార్లమెంట్‌ సీటు నుంచి వైసీపీ తరపున బరిలో దిగడంతో ఒక్కసారిగా అందరి దృష్టి అటు మళ్ళింది. డబ్బుకు కొదవ లేకపోవడం, వై.ఎస్‌ కుటుంబానికి సన్నిహితుడన్న పేరుతో…ఆ ఎన్నికల్లో పీవీపీ గెలుస్తారా? ఓడిపోతారా? అన్న ఉత్కంఠ వాతావరణం పెరిగింది. కానీ.. ఆ ఎన్నికల్లో జగన్‌ హవా ఉన్నా… ఫ్యాన్‌ హై స్పీడ్‌లో తిరిగినా…పీవీపీకి మాత్రం ఆ గాలి సరిపోలేదు. స్వల్ప తేడాతో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓడిపోయారాయన. ఆ తర్వాత పొలిటికల్‌ స్క్రీన్‌ నుంచి కనిపించకుండా పోయారు. ప్రత్యేకించి బెజవాడ పాలిటిక్స్‌తో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు.

పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా.. ఏ సూచనలు చేసినా.. దేన్నీ పట్టించుకునే వారు కాదట పీవీపీ. కాలక్రమంలో బెజవాడ వైసీపీ నేతలు కూడా ఆయన ఉన్నారనే విషయాన్ని మరిచిపోయారట. పీవీపీతో సంబంధం లేకుండానే బెజవాడ పార్లమెంట్‌ పరిధిలో వైసీపీ రాజకీయాలు చేసేస్తున్నారట. అలాంటి పరిస్థితుల్లో వరప్రసాద్‌ ఈ మధ్య ఠింగుమని ట్విట్టర్‌లో ప్రత్యక్షమవడం, ఏదో ఒక కామెంట్‌ పెట్టేసి మళ్ళీ సైలెంటైపోవడం చేస్తున్నారట. ఆ క్రమంలోనే తాజాగా ఆయన చేసిన ట్వీట్స్‌ టాక్‌ ఆఫ్‌ ది వైసీపీ అయ్యాయట. అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అని, పిల్లి గుడ్డిదైతే.. ఎలుక మీసాలు పట్టి దువ్విందని.., అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ప్రజలు కళ్లు తెరుస్తారు, ప్రజా కంటకుల పని పడతారు.. జైహింద్‌ అంటూ ఆయన చేసిన వరుస ట్వీట్స్‌ కలకలం రేపుతున్నాయి. పీవీపీ పరోక్షంగా వైసీపీ ప్రభుత్వాన్ని.. పార్టీ అధినాయకత్వాన్ని టార్గెట్‌ చేసుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అయిన వారు ఎవరు..? కాని వారు ఎవరు..? ఎవరు పిల్లి… ఎవరు ఎలుక అనే చర్చ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పీవీపీకి తిరిగి వైసీపీ టిక్కెట్‌ దక్కడం డౌటేనన్నది వైసీపీ వర్గాల అంచనా. అందుకే ఆయన అధినాయకత్వాన్ని టార్గెట్‌ చేసుకుని ఈ తరహా ట్వీట్లు చేస్తున్నారనే చర్చ జరుగుతోందట. తనకు టిక్కెట్‌ ఇవ్వరని తేలిపోయాకే… ఇలా.. టర్న్‌ అయ్యారన్న చర్చ బెజవాడ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే అయినవారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో అనే కామెంట్‌ చేశారని అనుకుంటున్నారట. ఈ తరహా కామెంట్లు చేయడం వెనుక మరో కీలక కారణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బెజవాడ నుంచి బీజేపీ తరపున పోటీ చేసే ఆలోచనలో పీవీపీ ఉన్నారని అంటున్నారు. త్వరలోనే కమలం గూటికి చేరతారనే ప్రచారం కూడా ఉంది. బెజవాడ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలకు.. గత కొన్ని రోజులుగా పీవీపీ చేస్తున్న ట్వీట్లు సింక్‌ అవుతున్నాయన్నది లోకల్‌ టాక్‌. కేంద్ర ప్రభుత్వ విధానాలు.. మోడీ పని తీరును ఆకాశానికెత్తేస్తూ ఇటీవల ట్వీట్‌ చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో మోడీని ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వ తీరును పొగిడేస్తూ రకరకాల ట్వీట్లు చేశారు పీవీపీ. అయితే ఏ సందర్భంలోనూ.. జగన్‌ గురించి కానీ.. వైసీపీ ప్రభుత్వం గురించి కానీ ఆ పని చేయలేదు.

Exit mobile version